- మధ్యాహ్నం 2కు అత్యవసర సమావేశం
- లాక్‌డౌన్, వానకాలం సాగుపై చర్చ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కానున్నది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. భేటీలో లాక్‌డౌన్, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరి నుంచి నీటిని ఎత్తిపోత, జలవిద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై చర్చించనున్నారు. కరోనా కట్టడికి రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించటంతో ప్రస్తుతం కొత్త కేసులు చాలావరకు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో శనివారం వరకు ఉన్న లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలా? లేదా మరిన్ని సడలింపులు ఇవ్వాలా అనేఅంశపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోనున్నది. కరోనా మూడో వేవ్ గురించి వస్తున్న సమాచారాన్ని కూడా మంత్రివర్గభేటీలో చర్చించే అవకాశం ఉన్నది. ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెప్తున్న నేపథ్యంలో పంటల సాగుపై మంత్రివర్గం పలు అంశాలను చర్చించనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి వివిధ రిజర్వాయర్లను నింపడం, అక్కడి నుంచి చెరువులు, కుంటలను నింపడంపైనా చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం ఉన్నది. రైతులకు రైతుబంధు డబ్బులు చేతికొస్తుండటంతో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచటం, నాణ్యమైన విత్తనాలను అందించడంపై దృష్టి పెట్టనున్నది. ప్రత్యామ్నాయ పంటల సాగుతోపాటు తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటడంపైనా చర్చించే అవకాశం ఉన్నది.