జాతీయం ముఖ్యాంశాలు

ఏయిమ్స్‌ ఆసుపత్రి బిల్డింగ్‌పై నుంచి పడి డాక్టర్‌ మృతి

ప్రమాదమా? ఆత్మహత్యా? అనే కోణంలో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) భవనంపై నుంచి కిందకు పడి ఒక వైద్యుడు దుర్మరణం పాలయ్యారు. అసోంలోని కమ్ రూప్ జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. హాస్పిటల్ ఏడో అంతస్తు నుంచి ఫాల్గు ప్రతిమ్ దాస్ అనే వైద్యుడు కిందకు పడ్డారు. ఆసుపత్రికి సంబంధించి నిర్మాణపు పనులు ఇంకా కొనసాగుతున్నాయి.

దీంతో అక్కడ పని చేస్తున్న కార్మికులకు పెద్ద శబ్దం వినిపించడంతో ఘటనా స్థలికి చేరుకున్నారు. రక్తం మడుగులో ఉన్న వైద్యుడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు… ఇది ప్రమాదవశాత్తు జరిగినదా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అక్కడ ఆసుపత్రి నిర్మాణం ఇంకా పూర్తి కానప్పటికీ… అక్కడ మెడికల్ విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తున్నారు.