భారత్ ప్రజలు, ప్రభుత్వానికి అమీర్ అబ్దుల్లాహేన్ ప్రశంసలు
మహమ్మద్ ప్రవక్త పట్ల బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాలన్నీ గుర్రుగా ఉన్న తరుణంలో.. భారత్ తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరాన్ విదేశాంగ మంత్రి న్యూఢిల్లీకి రావడం విశేషం. ప్రధాని మోడీ తో ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహేన్ భేటీ అయ్యారు. అలాగే, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ తదితరులతోనూ ఆయన చర్చలు నిర్వహించారు.
వాణిజ్యం, అనుసంధానం, సీమాంతర ఉగ్రవాదం తదితర అంశాలపై వీరి భేటీలో చర్చలు జరిగాయి. గతేడాదే బాధ్యతలు చేపట్టిన అమీర్ అబ్దుల్లాహేన్ భారత్ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. కొందరు వ్యక్తులు మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు వ్యతిరేక వాతావరణానికి దారితీసినట్టు ఆయన అజిత్ దోబల్ కు తెలియజేశారు.
భారత్ మహమ్మద్ ప్రవక్తను గౌరవిస్తుందని ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రికి భారత్ స్పష్టం చేసింది. ఈ అంశంలో ఇతరులకు ఒక పాఠంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని భారత్ హామీ ఇచ్చినట్టు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. పరస్పరం మతాలను గౌరవించుకోవాలని, విభజన వాద ప్రకటనలను నివారించాలన్న అంగీకారానికి వచ్చినట్టు అబ్దుల్లాహేన్ ట్వీట్ చేశారు. నిందితుల పట్ల భారత్ అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిపై ముస్లింలు సంతోషంగా ఉన్నట్టు చెప్పారు. దైవ విశ్వాసాల పట్ల భారత్, భారత ప్రజలు చూపించే గౌరవాన్ని కొనియాడారు. మొత్తానికి భారత్ తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరాన్ ఆసక్తి చూపించింది.