కేంద్రం తీసుకొచ్చిన అగ్ని పథ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ స్కీంను కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా అగ్నివీరులకు.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్), అసోం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటన జారీ చేసింది.
అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యాలయం ప్రకటించింది. ఫలితంగా తొలిబ్యాచ్ అగ్నివీరులకు వయోపరిమితిలో మొత్తంగా ఐదేళ్ల సడలింపు లభించనున్నట్లు స్పష్టం చేసింది. కరోనా కారణంగా రెండేళ్లు రిక్రూట్మెంట్ జరగలేదని.. ఇప్పటికే ఈ ఏడాది అగ్నిపథ్ కింద జరగబోయే నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పొడిగించిన విషయం తెలిసిందే. శుక్రవారం ‘అగ్నిపథ్’పై సికింద్రాబాద్ ఆందోళనలు రణరంగాన్ని తలపించాయి. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ సికింద్రాబాద్‌లో చేసిన ఆందోళనలు… తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోపక్క రేపు అగ్నిపథ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశ వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది .