పంట కాల్వను ఆక్రమించి గోడను నిర్మించారని, ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ నర్సీపట్నంలోని అయ్యనపాత్రుడి ఇంటి గోడను జేసీబీ లతో కూల్చిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇంటిజోలికి వెళ్లవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్థరాత్రి కూల్చివేతలేంటని ప్రశ్నించింది. నర్సీపట్నంలో ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత ప్రక్రియను నిలువరించాలని కోరుతూ తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారులు విజయ్, రాజేష్ ఆదివారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపించారు. ఆమోదం పొందిన ప్లాన్ ప్రకారమే ప్రహరీ నిర్మాణం జరిగిందని, తహసీల్దార్, జలవనరుల శాఖ అధికారులు పరిశీలించి హద్దులు నిర్ణయించిన తర్వాతే గోడను నిర్మించినట్టు కోర్టుకు తెలిపారు.
రాజకీయ కక్షతో, నిబంధనలను ఉల్లంఘించి కూల్చివేత ప్రారంభించారన్నారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్.. అర్ధరాత్రి కూల్చివేతలేంటంటూ విస్మయం వ్యక్తం చేశారు. కూల్చివేత ప్రక్రియలో ముందుకెళ్లవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల విషయాన్ని అధికారులకు వెంటనే తెలియజేయాలని ఆదేశించారు. రెవెన్యూశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రహరీలోని కొంత భాగాన్ని ఇప్పటికే కూల్చివేసినట్టు చెప్పారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
ఇక చోడవరం మినీమహానాడు వేదికగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు చేయించారని టీడీపి ఆగ్రహం వ్యక్తం చేసారు. అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత.. ముమ్మాటికీ కక్ష సాధింపేనని అన్నారు. టీడీపీ లో బలమైన బీసీ నేతలే లక్ష్యంగా.. జగన్ రెడ్డి అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చోడవరం మినీమహానాడు వేదికగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు చేయించారని.. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయ్యన్న ప్రశ్నల్లో.. ఏ ఒక్కదానికీ జగన్ సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరని చంద్రబాబు అన్నారు. అందువల్లే కూల్చివేతలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడికి మద్దతుగా ఉంటామని తెలిపారు.