రాజకీయ పరిణామాలతో హైదరాబాద్ ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాని మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలంతా ఈరోజు హైదరాబాద్ కు విచ్చేస్తున్నారు. ఇదే సమయంలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా ఈరోజు హైదరాబాద్ కు వచ్చారు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ట్విట్టర్ ద్వారా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఫిబ్రవరిలో మోదీగారు నగరానికొస్తే జ్వరమని ఫార్మ్ హౌస్ల పన్నవ్. మొన్న హైదరాబాద్ వస్తే పక్క రాష్ట్రానికి జారుకున్నవ్. ఈసారి 2 రోజులు ఇక్కడనే ఉంటున్నాడు మోడీ గారు. ఊర్లనే ఉంటవా? ఊర్లు పట్టుకొని తిరుగుతవా దొరా? నీ మేకపోతు గాంభీర్యాలు బరాబర్ బయటపెడతము ‘ అని ట్వీట్ చేశారు.
బండి సంజయ్ ట్వీట్ కు అదే స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ సమాధానమిచ్చింది. ‘కడుపుల విషం పెట్టుకొని, కల్లబొల్లి మాటలు మాట్లాడేటోళ్లను కలుస్తెంత, కల్వకపోతెంత? ఎక్వతక్వ సప్పుడుజేయకుండ, మీటింగ్ అయిపోగొట్కోని, బిర్యానీ తిని, ఛాయ్ తాగి, చూసిన తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ ను ఫాలోకండ్రి. మూటలేమో గుజరాత్ కు, విద్వేషపు మాటలేమో తెలంగాణకా? చల్ హట్ అంటూ ఘాటుగా స్పందించింది.