తెలంగాణ ముఖ్యాంశాలు

జగ్గారెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేయబోతున్నారా..?

కాంగ్రెస్ పార్టీ నేతలను , కార్య కర్తలను మరోసారి జగ్గారెడ్డి టెన్షన్లో పడేసాడు. రేపు సంచలన ప్రకటన చేయబోతున్నట్లు తెలుపడంతో..జగ్గారెడ్డి పార్టీ కి రాజీనామా ఏమైనా చేయబోతున్నారా..అని మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు. కొద్ది నెలల క్రితం వరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో జగ్గారెడ్డి విభేదిస్తూ వచ్చారు. అయితే, ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో తెలంగాణ నేతలు సమావేశం అయిన తరువాత విభేదాలు తగ్గుముఖం పట్టాయి. జగ్గారెడ్డి సైతం తన కుటుంబ సభ్యులతో పాటుగా రాహుల్ గాంధీని కలిసారు. పార్టీలో ఏ సమస్య వచ్చినా నేరుగా తనకే చెప్పాలని..మీడియాకు ఎక్కవద్దంటూ రాహుల్ సూచించారు. దీనికి జగ్గారెడ్డి సైతం అంగీకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేవంత్ తో కలిసే కొనసాగుతున్నారు.

ఇక నిన్న శనివారం రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ లో పర్యటించారు. ఆయనకు టిఆర్ఎస్ గ్రాండ్ వెల్ కం చెప్పింది. కేసీఆర్ తో సమావేశమైన తరువాత తాము సిన్హాతో సమావేశం అయ్యేది లేదని రేవంత్ తేల్చి చెప్పారు. దీనిని జగ్గారెడ్డి వ్యతిరేకించారు. జాతీయ స్థాయిలో మద్దతు ఇస్తూ.. రాష్ట్రానికి వచ్చిన వేళ కలవకపోవటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. అయితే, సిన్హా బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన సమయంలో పార్టీ సీనియర్ నేత వీహెచ్ వ్యక్తిగతంగా వెళ్లి కలిసారు. దీనికి రేవంత్ తప్పు బట్టారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండని వారిని గోడకేసి బాదాలంటూ వ్యాఖ్యానించారు. దీని పైన సీరియస్ గా రియాక్ట్ అయిన జగ్గారెడ్డి…వీహెచ్ వయసు ఎంత.. నీ వయసు ఎంత.. నీ ఇంట్లో జీతాళ్లమనుకుంటున్నావా..అంటూ వ్యాఖ్యానించారు.

టెంప్ట్ అయ్యే వాడివి పీసీసీ పోస్టుకు ఎలా అర్హుడయ్యావన్న జగ్గారెడ్డి .. పీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్ ను తొలగించాల్సిందిగా హైకమాండ్ కు లేఖ రాస్తానన్నారు. నూటికి నూరు శాతం రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి లేకపోయినా పార్టీని నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక, ఇప్పుడు తాజాగా జగ్గారెడ్డి ఒక లేఖ విడుదల చేసారు. రేపు కీలక నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసారు. రేవంత్ కు వ్యూహం లేదని.. పార్టీని నడిపించాలంటే వ్యూహాలు ఉండాలని పేర్కొన్నారు. గతంలో టీడీపీలో రేవంత్ పని చేసిన సమయంలో ఇదే రకంగా ఓటుకు నోటు లో వ్యవహరించారని చెప్పుకొచ్చారు. రేవంత్ కారణంగా ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇప్పుడు రాష్ట్రం వదిలి వెళ్లాల్సి వచ్చిందంటూ పేర్కొన్నారు. తాను గతంలో రాహుల్ కు ఏ సమస్య ఉన్నా వివరిస్తానని మాట ఇచ్చానని.. ఇప్పుడు ఆ మాట తప్పుతున్నందుకు బాధగా ఉందంటూ వివరించారు. ప్రస్తుతం రేవంత్ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తుంది. మరి రేపు జగ్గారెడ్డి ఏ నిర్ణయం ప్రకటిస్తారో అని అంత టెన్షన్ పడుతున్నారు.