సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉండే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..జగన్ ఫై సినిమా డైలాగ్స్ తో ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఎన్నో డైలాగ్స్ ను వాడిన లోకేష్..తాజాగా బాలకృష్ణ డైలాగ్ ను వాడుకున్నాడు. జనం సొమ్ము జలగలా పీల్చేస్తున్న జగన్ జనానికి ఎదురొచ్చినా…జనమే ఆయనకు ఎదురెళ్లినా జనానికే రిస్కు అంటూ లోకేశ్ ట్వీట్ చేసాడు.
మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్న చందంగా జగన్ వ్యవహారం ఉంటోందని ఆయన ఆరోపించారు. వలంటీర్లకు ప్రభుత్వం నుంచి అందిస్తున్న సౌకర్యాలపై వరుస ట్వీట్లను పోస్ట్ చేసిన లోకేశ్… సాక్షి పత్రిక వేయించుకునేందుకు కూడా వలంటీర్లకు జగన్ సర్కారు నిధులు కేటాయించిందని ఆరోపించారు.
జనం సొమ్మును దోచేందుకు జగన్ అండ్ కో ఆడని నాటకమే లేదని ఆరోపించిన లోకేశ్.. వైసీపీ కార్యకర్తలను వలంటీర్లుగా పెట్టుకుని పార్టీ కోసం పనిచేయిస్తూ ప్రజా ధనాన్ని ధారపోస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ కార్యకర్తలైన వలంటీర్లకు రూ.233 కోట్లతో సెల్ ఫోన్లు కొనిచ్చిన జగన్.. ఇప్పుడు జనం సొమ్ము సొంతానికి ఎలా వాడుకోవాలనే అత్యాశతో మరో ఆర్డర్ తెచ్చారని దుమ్మెత్తిపోశారు.
ఖజానాలో డబ్బులు లేవని ప్రజాసంక్షేమ పథకాలు ఆపేసిన ప్రభుత్వం.. రూ.300 కోట్లతో సాక్షి పత్రికకు ప్రకటనలు ఇచ్చిందని లోకేశ్ ఆరోపించారు. అక్కడితో ఆగకుండా రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకోవాలంటే సాక్షి పత్రికను వేయించుకోవాలని ఆదేశించిన జగన్.. అందుకోసం నెలకు రూ.5.32 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వలంటీర్లు సాక్షి పత్రికను చదివేందుకే జగన్ సర్కారు ఏడాదికి 63.84 కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు.