సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో బిజెపి ప్రజా సంకల్ప సభ ముగిసింది. సభకు లక్షల మంది హాజరయ్యారు. సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరుకావడం తో బిజెపి నేతలు సంబరాలు చేసుకున్నారు. ఇక మోడీ అయితే ఆ జనసంద్రాన్ని చూసి బండి సంజయ్ ని మెచ్చుకున్నారు. ఇక సభలో బండి సంజయ్ ప్రసంగిస్తూ మోడీ చేసిన సేవలను కొనియాడుతూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ప్రధాని మోడీపై టిఆర్ఎస్ నేతల విమర్శలు చూస్తే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీని ఎందుకు తిడుతున్నారో టిఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే మోడీని కేసీఆర్ తిడుతున్నారని ఆరోపించారు.
పేదలు ఆకలితో అలమంటిచొద్దని చెప్పి.. ఉచిత బియ్యం ఇస్తున్నందుకు తిడుతున్నరా ? 200 కోట్ల టీకా డోసులను దేశ ప్రజలకు ఉచితంగా ఇచ్చినందుకు తిడుతున్నరా ? ఉక్రెయిన్ లో భారతీయులు, తెలుగువాళ్లు ఇరుక్కుపోతే.. యుద్ధాన్ని ఆపించి మరీ, తెలుగు రాష్ట్ర యువతను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకొచ్చినందుకు తిడుతున్నరా ?’’ అని సంజయ్ భావోద్వేగంగా చెప్పారు. ‘‘ఒక్కసారి ఆ మహానుభావుడు మోడీకి ఘనంగా స్వాగతం పలికితే.. గడీలో బందీగా మారిన తెలంగాణ తల్లి పులకరించిపోతుంది. తెలంగాణ తల్లికి ధైర్యం వస్తుంది. బీజేపీ సేన యుద్ధానికి సిద్ధమైందనే సంకేతం వెళ్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. అందరూ లేచి నిలబడి జై మోడీ నినాదాలు చేయాలని సంజయ్ కోరగానే.. సభకు హాజరైన బీజేపీ శ్రేణులు, వేదికపైనున్న పార్టీ నాయకులంతా కలిసి నిలబడి ‘జై మోడీ.. జై మోడీ’ అంటూ నినాదాలు చేశారు. పేదలను ఆదుకున్న దేవుడు మా మోడీ అని , భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా కేసీఆర్ గడీని బద్దలు కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చేలా ప్రజలు మద్దతివ్వాలన్నారు. అందుకోసం ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని సూచించారు.