జాతీయం

రికార్డు దిశగా భారత విదేశీ మారక నిల్వలు…!

ఫారెక్స్‌ నిల్వలు.. కొనసాగుతున్న దూకుడు!

సరికొత్త గరిష్టం

608.08 బిలియన్‌ డాలర్లకు అప్‌

భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి. జూన్‌ 11తో ముగిసిన వారంలో వరుసగా రెండవవారమూ 600 బిలియన్‌ డాలర్ల ఎగువన సరికొత్త గరిష్ట స్థాయిలను నమోదుచేసుకున్నాయి. వారంవారీగా నిల్వలు 3.074 బిలియన్‌ డాలర్లు పెరిగి 608.081 బిలియన్‌ డాలర్లకు చేరాయి (డాలర్‌ మారకంలో రూపాయి ప్రస్తుత విలువ ప్రకారం  దాదాపు రూ.45 లక్షల కోట్లు) . శుక్రవారం ఆర్‌బీఐ తాజా గణాంకాలను విడుదల చేసింది.

2020 జూన్‌ 5తో ముగిసిన వారంలో మొట్టమొదటిసారి భారత్‌ ఫారెక్స్‌ నిల్వలు అర ట్రిలియన్‌ మార్క్‌దాటి 501.70 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అటు తర్వాత కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ,  నిల్వలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఏడాది తిరిగే సరికి నిల్వలు మరో 100 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. జూన్‌ 4వతేదీతో ముగిసిన వారంలో మొదటిసారి 600 బిలియన్‌ డాలర్లను దాటి 605.008 డాలర్ల స్థాయికి చేరాయి.

తాజా సమీక్షా వారంలో ఈ దూకుడు కొనసాగింది. ప్రస్తుత నిల్వలు భారత్‌ 20 నెలల దిగుమతులకు  దాదాపు సరిపోతాయన్నది అంచనా. అంతర్జాతీయంగా భారత్‌ ఎకానమీకి వచ్చే కష్టనష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి ప్రస్తుత స్థాయి నిల్వలు దోహదపడతాయని ఈ నెల మొదట్లో జరిగిన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష విశ్లేషించిన సంగతి తెలిసిందే.

గణాంకాలను విభాగాల వారీగా పరిశీలిస్తే..

  • మొత్తం నిల్వల్లో డాలర్ల రూపంలో చూస్తే ప్రధానమైన ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ విలువ తాజా సమీక్షా వారంలో 2.567 బిలియన్‌ డాలర్లు పెరిగి 563.457 బిలియన్‌ డాలర్లకు చేరింది. 
  • పసిడి నిల్వలు 496 మిలియన్‌ డాలర్లు ఎగసి 38.101 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 
  • అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వద్ద స్పెషల్‌ డ్రాయింగ్స్‌ రైట్స్‌ విలువ 1 మిలియన్‌ డాలర్లు తగ్గి 1.512 డాలర్లకు చేరింది.
  • ఐఎంఎఫ్‌ వద్ద భారత్‌ ఫారెక్స్‌ నిల్వల పరిమాణం 11 మిలియన్‌ డాలర్లు పెరిగి 5.011 బిలియన్‌ డాలర్లకు చేరాయి.