వర్షాల ఎఫెక్ట్ : సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని డీహెచ్ శ్రీనివాసరావు హెచ్చరిక
కరోనా తగ్గాక డెంగీ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని , దోమలు, అపరిశుభ్రవాతావరణంతో డెంగీ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. నీరు, ఆహారం కలుషితమైతే విషజ్వరాలు వస్తున్నాయని , ఈ ఏడాది డెంగీతో పాటు టైపాయిడ్ కేసులు పెరిగాయని శ్రీవాసరావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టైపాయిడ్, డెంగీ కేసులు ఎక్కువ వస్తున్నాయన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరి అన్నారు. మంచినీరు, ఆహారంపై దోమలు వాలకుండా ఉండాలని.. ఫ్రెష్ కూరగాయలు, వేడిగా ఉన్నప్పుడే తినడం మంచిదని సూచించారు. గతవారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పుడు సీజనల్ వ్యాధులతో పోరాడాలన్నారు. బ్యాక్టీరియా, వైరస్‌తో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని, పాముకాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
రాష్ట్రంలో మలేరియా కేసులు కూడా నమోదవుతున్నాయని డీహెచ్ తెలిపారు. భద్రాద్రిలో 115, మలుగులో 113, భూపాలపల్లిలో నాలుగు, ఆసిఫాబాద్‌లో మూడు, నల్లగొండలో ఐదు కేసులు నమోదయ్యాయని చెప్పారు. మే నెలలో మూడు చికున్ గున్యా కేసులు రికార్డయ్యాయన్నారు. ఈ నెలలో ఆరువేల విరేచనాల కేసులు నమోదయ్యాయని, ఈ ఏడాది టైఫాయిడ్ కేసులు సైతం ఎక్కువగానే నమోదవుతున్నాయన్నారు. జ్వరం వచ్చినప్పడు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధుల టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోకుండా.. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో గర్భిణులు వారం ముందే ఆసుపత్రుల్లో చేరి వైద్యం తీసుకోవాలన్నారు. బాలింతలు, చంటిపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/