Random Posts తెలంగాణ ముఖ్యాంశాలు

GHMC హెచ్చరిక – నగరవాసులంతా ఈ 12 గంటలు జాగ్రత్తగా ఉండాలి

GHMC హెచ్చరిక – గత ఐదు రోజులుగా హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షం ఇప్పుడు తగ్గుతుందో అని అంత అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే GHMC ఓ హెచ్చరిక జారీ చేసింది. నగరవ్యాప్తంగా రాబోయే 12 గంటల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఈరోజు రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు బలమైన గాలులు వీస్తాయని , చెట్లు కూలే అవకాశం ఉందని తెలిపింది. చెట్ల కింద ఎవరూ ఉండొద్దని హెచ్చరిక ఇచ్చింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎమర్జెన్సీ కోసం NDRF బృందాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ముంపు ప్రాంతాలను అధికారులు అలర్ట్ చేశారు.

కరెంట్ పోల్స్ దగ్గర, చెట్ల కింద, నాలాల పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎవరు నిలబడవద్దని నగరవాసులను జీహెచ్ఎంసీ కమిషనర్ కోరారు. ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని నగర మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ప్రజలు అత్యవసర సమయాల్లో అవసరమైతేనే బయటకు రావాలని, లేదంటే ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. కూకట్‌పల్లి నాలా నుంచి వస్తున్న నీరు సైతం హుస్సేన్‌‌సాగర్‌లోకి చేరుతోంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం పూర్తి స్థాయికి చేరుకుంది. వస్తున్న నీటి ఇన్‌ఫ్లోకు… సమానంగా తూముల ద్వారా నీరు బయటకు వెళుతోంది.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/