భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి తగ్గుతుండడంతో బ్రిడ్జి పై వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం గోదావరి 60 అడుగులకు చేరింది. కాకపోతే ముంపు గ్రామాల్లో ఇంకా వరద నీరు అలాగే ఉండడం తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈరోజు సీఎం కేసీఆర్ భద్రాచలం లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ముందుగా గోదావరి నదిపై కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేసి, కరకట్టను పరిశీలించారు. అక్కడినుండి భద్రాచలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్న కేసీఆర్ ముంపు బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసరాలు, వైద్యం, ఇతర సౌకర్యాల గురించి సీఎం ఆరా తీశారు.
అనంతరం మాట్లాడుతూ..భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని ప్రకటన చేశారు. ముంపు బాధితులకు కోసం.. ఎత్తైన ప్రాంతాలను చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీని కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి అధికారులు వస్తారని స్పష్టం చేశారు. వరద బాధితులకు రూ.10వేలు, 20 కిలోల బియ్యం ఇస్తామని చెప్పారు.
భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర ఉందని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ (అనూహ్య రీతిలో భారీ వర్షపాతం) అనే కొత్త పద్ధతి వచ్చిందన్నారు. క్లౌడ్ బరస్ట్‌పై ఏదో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారు. కుట్రలు ఎంత వరకు నిజమో తెలియదు. ఇతర దేశాల వాళ్లు కావాలని మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారు. గతంలో లడాఖ్, లేహ్, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంపై కూడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్లు సమాచారం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/