హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తట్టుకోవడం సులువు కాదు. ఎప్పుడు బయటకు వెళ్లినా ట్రాఫిక్ కష్టాలు తప్పవు. శని, ఆదివారాలు కూడా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. వాహనాలు ముందుకు కదలడానికే ఇబ్బంది. ప్రధానంగా జూబ్లీహిల్స్, రాయదుర్గం, లక్డీకాపూల్, అమీర్ పేట్, కూకట్ పల్లి వరకూ ఎక్కడ చూసినా రద్దీయే. గంటల కొద్దీ ప్రయాణం. సరూర్ నగర్ నుంచి కూకట్ పల్లికి వెళ్లివచ్చేసరికి కారులో విజయవాడ వెళ్లిపోవచ్చు అన్న సామెత అక్షర సత్యం. అంత రద్దీతో ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. పెట్రోలు కూడా అత్యధిక స్థాయిలో వినియోగం అవుతుంది.. ఈ సమయంలో మెట్రో రైలు ప్రయాణం ఎంతో సుఖవంతంగా మారింది. తక్కువ ఖర్చుతో అరగంటలో ఎక్కడికైనా చేరుకునే వీలు కలిగింది. మొన్నమొన్న వరకూ మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయి నడుస్తున్నాయి. ప్రధానంగా సోమవారం నుంచి శుక్రవారం వరకూ అమీర్ పేట్ స్టేషన్ లో కాలుమోపలేని పరిస్థితి. సాఫ్ట్్ వేర్ ఇంజనీర్లు మొత్తం మెట్రో రైళ్లను ఆశ్రయించే వారు. అందుకే ఎప్పుడూ రద్దీగా ఉండేది.
ఇక సాధారణ, మధ్యతరగతి ప్రజలు కూడా మెట్రో రైలులో చల్లటి వాతావరంణంలో సుఖంగా, సౌకర్య వంతంగా, వేగంగా చేరుకునే వీలుండటంతో అందరూ మెట్రో రైలునే వినియోగించుకునే వారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో కొంత మైట్రో రైళ్లలో రద్దీ తగ్గిందని ప్రచారం జరుగుతుంది. ఫ్రీ బస్సు పథకం కారణంగా మెట్రో రైళ్లు నష్టాల్లో నడుస్తు న్నాయన్న క్యాంపెయిన్ జరుగుతుంది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఆర్టీసీ బస్సులయితే రద్దీగా ఉంటున్నాయి. మెట్రో రైళ్లు కూడా రద్దీ ఉన్నట్లే కనపడుతున్నా నష్టాల్లో ఉన్నాయని ఆ సంస్థ చెబుతోంది. దీనికి తోడు మెట్రో రైలును 2026 తర్వాత అమ్మకానికి పెడుతున్నట్లు ఎల్ అండ్ టి సంస్థ అధ్యక్షుడు ఆర్ శంకర్ రామన్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లోనే కాదు.. పారిశ్రామిక వర్గాల్లోనూ కలకలం రేపుతుంది. ఆయన ప్రకటన వాస్తవమే అయినా.. మెట్రో రైళ్లు ఫ్రీ బస్సు కారణంగానే నష్ట్రాల్లో కూరుకుపోయాయా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. ఒక్కటి మాత్రం నిజం.. కొత్త ప్రభుత్వం మెట్రో రైళ్లను విస్తరించాలని నిర్ణయించింది.
గత ప్రభుత్వం కూడా ఈ మేరకు ప్రతిపాదనలను విస్తరణకోసం తయారు చేసింది. అయితే ఎల్ అండ్ టి యాజమాన్యం మాత్రం కారణాలు చెప్పకపోయినా మెట్రో రైల్ సంస్థను విక్రయించేందుకు సిద్ధపడటం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలు మాత్రం ఈ ప్రకటనను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఫ్రీ బస్సు పథకం కారణంగానే మెట్రో రైళ్లు నష్టాల్లో నడుస్తున్నాయని పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో నిజానిజాలు ఎలా ఉన్నా.. మెట్రో రైళ్లు సేవలను హైదరాబాదీలకు అత్యంత అవసరం. దానిని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అది మాత్రం వాస్తవం.