పాలమూరు రంగారెడ్డి ఫ్యాకేజీ 1 లో జరిగిన ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేసారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. కొల్లాపూర్ మండలం రేగమనగడ్డ దగ్గర జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనుల్లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు కూలీలు మరణించారు. క్రేన్ సాయంతో పంప్ హౌస్ లోకి దిగుతుండగా వైర్ తెగిపోవడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాద ఘటన ఫై బండి సంజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చనిపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం జరగడానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం ఈ ఘటన ఫై స్పందించారు. ఈ ప్రమాదంలో మరణించిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.50 లక్షల రూపాయల నష్ట పరిహారం అందజేయాలని జూపల్లి డిమాండ్ చేశారు. వీరి కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు పోరాడుదామని పిలుపునిచ్చారు. రెడిమిక్స్ లిఫ్ట్ చేస్తుండగా ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబం సభ్యులు చెప్పారన్న జూపల్లి కృష్ణారావు..కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. అంతే కాకుండా కాంట్రాక్టర్ సహా సంబంధిత వారిపై పోలీసులు హత్య కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్న జూపల్లి..భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్య బృందం అభిజిత్ నేతృత్వంలో ఐదుగురు కార్మికుల మృతదేహాలకు పోస్ట్ మార్టం కొనసాగుతోంది. ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు జార్ఖండ్ కు చెందిన భోలేనాథ్ (45), ప్రవీణ్ (38), కమలేష్ (36 ), బీహార్ కు చెందిన సోను కుమార్ (36), ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీను (40)గా గుర్తించారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/