తెలంగాణ ముఖ్యాంశాలు

మంత్రి కేటీఆర్‌: ఈ నెల 7న నేతన్న బీమా పథకం ప్రారంభం

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం రోజున కొత్త బీమా పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా నేతన్నకు బీమా పథకం ప్రవేశపెడుతున్న ఏకైక సర్కార్ తెలంగాణయేనని అన్నారు. రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకం కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 80వేల మంది నేత కార్మికులు నేతన్న బీమా పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని కేటీఆర్ వెల్లడించారు. 60 ఏళ్ల లోపు వయసున్న ప్రతి నేత కార్మికునికి బీమా వర్తిస్తుందని చెప్పారు. దురదృష్టవశాత్తు నేత కార్మికులు మరణిస్తే రూ.5 లక్షలు బీమా పరిహారం కింద ఇస్తామని ప్రకటించారు. బీమాతో నేత కార్మికులకు, వారి కుటుంబాలకు భరోసా కలుగుతుందని కేటీఆర్ అన్నారు.

‘చేనేత కార్మికులు నిత్యం మగ్గం గుంతలో కూర్చొని కంటికి కనిపించని పోగులతో పనులు చేయాల్సి ఉంటుంది. అలాగే.. బరువైన యంత్రాలను తొక్కాల్సి వస్తోంది. ఈ క్రమంలో 40 ఏళ్లకే చాలా మంది అనారోగ్యాల బారిన పడుతుండటంతో వారి జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినా, సహజంగా మరణించినా, ఏదైనా ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం కలిగినా రూ.5 లక్షల బీమా సొమ్ము అందుతుంది. వారి కుటుంబాలకు భరోసాకు నిలుస్తుంది.’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/