ప్రధాని మోడీ, సీఎం గెహ్లాట్ సంతాపం
రాజస్థాన్ లోని శికర్ జిల్లాలోని ఖతు శ్యామ్‌జీ ఆలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ తెల్లవారుజామున నిర్వహించిన నెలవారీ జాతర సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరిని మరింత మెరుగైన చికిత్స కోసం జైపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆలయంలోనే ఉన్న పోలీసులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు.
వేకువజామున 5 గంటల ప్రాంతంలో ఆలయ ద్వారాలు తెరుచుకోగానే అప్పటికే వేచి చూస్తున్న వందలాదిమంది భక్తులు ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో శ్యామ్‌జీ భక్తులైన ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు ఒకరిని మాత్రమే గుర్తించారు. విషయం తెలిసిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమైన సంఘటన అని పేర్కొన్న సీఎం.. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఖతు శ్యామ్‌జీ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ఘటన తనను బాధించిందన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిసిన మోడీ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/