జాతీయం ముఖ్యాంశాలు

బిజెపి ఎంపీలు నిషికాంత్ దూబే, మ‌నోజ్ తివారీల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు

అనుమతి లేని రాత్రి సమయంలో టేకాఫ్ కు అనుమతి ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి

జార్ఖండ్‌లోని దియోఘ‌ఢ్ ఎయిర్‌పోర్ట్‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా త‌మ చార్ట‌ర్డ్ విమానం టేకాఫ్‌కు అనుమ‌తించాల‌ని అధికారుల‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చార‌ని బిజెపి ఎంపీలు నిషికాంత్ దూబే, మ‌నోజ్ తివారీ స‌హా ఏడుగురు ఇత‌రుల‌పై కేసు న‌మోదైంది.విమానాశ్రయ డీఎస్పీ సుమన్ అనన్ ఫిర్యాదు మేరకు బిజెపి నేతలపై కేసు నమోదు చేశారు. నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్‌తో సహా తొమ్మిది మంది వ్యక్తులపై ఇతరుల ప్రాణాలు, భద్రతకు అపాయం కలిగించడంతో పాటు నేరపూరిత నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఆగస్టు 31న లోక్‌సభ ఎంపీనిషికాంత్ దూబే, ఆయన కుమారుడు కనిష్క్ కాంత్ దూబే, మహికాంత్ దూబే, ఎంపీ మనోజ్ తివారీ, ముఖేష్ పాథక్, దేవతా పాండే, పింటూ తివారీలు భారీ భద్రత ఉండే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) రూమ్లోకి ప్రవేశించారు. దేవఘర్ విమానాశ్రయం నుంచి తమ చార్టర్డ్ ఫ్లైట్ టేకాఫ్ కావడానికి క్లియరెన్స్ ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే, కొత్తగా ప్రారంభమైన విమానాశ్రయం నుంచి రాత్రి కార్యకలాపాలకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. సదరు ఎయిర్ పోర్టులో విమాన సేవలు ప్రస్తుతం సూర్యాస్తమయానికి 30 నిమిషాల ముందు వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ, సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం 6:03 గంటల సమయంలో బిజెపి నేతలు అనుమతి కోసం ఏటీసీలోకి వచ్చారు. వాళ్ల ఫ్లైట్ సాయంత్రం 6:17 గంటలకు అక్కడి నుంచి బయలుదేరింది.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/