కృత్రిమ మేథ సాయంతో ఓ న్యూస్ యాంకర్‌ను రూపొందించింది ఒడిశాకు చెందిన ఓటీవీ! చిరకట్టులో లిసా.. గడగడా వార్తలు చదివేస్తోంది!
OTV AI Anchor : కృత్రిమ మేథ (ఏఐ)తో ప్రపంచంలో జరుగుతున్న అద్భుతాలు అందరిని కట్టిపడేస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో ఆసక్తికర సంఘటన ఆవిష్కృతమైంది. కృత్రిమ మేథను ఉపయోగించుకుని, దేశంలోనే తొలి ఐఏ న్యూస్ యాంకర్‌ను ఆవిష్కరించింది ఒడిశాకు చెందిన ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్. ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ పేరు లిసా. ఆ టీవీ ఛానెల్ పేరు ఓటీవీ. పూర్తి వివరాల్లోకి వెళితే..
వర్చువల్ న్యూస్ యాంకర్..
లిసాను ఆదివారం లాంచ్ చేసింది ఓటీవీ. చీరకట్టులో అచ్చం నిజమైన మహిళలాగా ఉంటూ, న్యూస్‌ను గడగడా చెప్పేసింది లిసా. ఒడియాతో పాటు ఇంగ్లీష్‌లోనూ వార్తలను చదివే విధంగా లిసాను సిద్ధం చేశారు. వాస్తవానికి ఈ ఏఐ న్యూస్ యాంకర్‌కు దేశంలోని అన్ని భాషలు వచ్చు! కానీ ప్రస్తుతానికి ఒడియా, ఇంగ్లీష్‌పైనే దృష్టిపెట్టినట్టు ఓటీవీ ఓ ప్రకటనలో తెలిపింది.
“ఓటీవీ ఏఐ యాంకర్ లిసాకు అన్ని భాషలు వచ్చు. ఓటీవీతో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఒడియా, ఇంగ్లీష్‌ను అనర్గళంగా మాట్లాడగలదు. దేశ జర్నలిజం చరిత్రలో ఇదొక అద్భుతం. కృత్రిమ మేథను అందిపుచ్చుకోవడంలో ఇదొక మైలురాయి,” అని ఓటీవీ వెల్లడించింది.
కంప్యూటర్ జనరేటెడ్ మోడల్స్ ఈ ఏఐ న్యూస్ యాంకర్లు. ముఖ కవళికలు, హావాభావాలు, సరైన భావోద్వేగాలను తెలుసుకుంటూ.. వార్తను చాలా ఖచ్చితత్వంతో చెప్పగలవు ఈ యాంకర్లు. కొన్ని ఏఐ యాంకర్లు.. రియల్ టైమ్‌లో యూజర్ల ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పగలవు. బ్రేకింగ్ న్యూస్‌లు కూడా వెంటనే ఇవ్వగలవు.
అయితే ఈ తరహా ఏఐ న్యూస్ యాంకర్లను దుర్వినియోగించుకే ప్రమాదం ఉంటుందని, తప్పుడు ప్రచారాల కోసం వాడుకునే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.