సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో నిలబడ్డ భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం ఘన విజయం సాధించారు.
సింగపూర్ అధ్యక్షుడి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నిలబడ్డ భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం ఘన విజయం సాధించారు. సింగపూర్ 9వ అధ్యక్ష పోలింగ్ సెప్టెంబర్ 1న జరగ్గా.. ఇందులో 70.40 శాతం ఓట్లు షణ్ముగరత్నానికి పోల్ అయ్యాయి. అయితే.. సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన మూడో వ్యక్తిగా పదవి చేపట్టనున్నారు. షణ్ముగరత్నం సింగపూర్‌లో జన్మించారు.
2001లో ధర్మాన్ షణ్ముగరత్నం పాలిటిక్స్ లోకి వచ్చారు. ఆయన పూర్వీకులు తమిళనాడుకు చెందినవారు. రెండు దశాబ్దాల పాటు అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీలో పలు మంత్రి పదవులు చేపట్టారు. ఈ క్రమంలో 2011- 2019 మధ్య సింగపూర్ ఉప ప్రధానమంత్రిగా పనిచేయడం షణ్ముగరత్నానికి కలిసొచ్చింది. సింగపూర్ వాసులు తనకే మద్దతు ఇస్తారని ఎన్నికలు జరగడానికి ముందే షణ్ముగరత్నం దీమా వ్యక్తం చేశారు. ఆయన ఊహించినట్లుగానే ప్రజలంతా ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. 70 శాతం ఓట్లు ఆయనకే నమోదు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇక సింగపూర్ ప్రస్తుత అధ్యక్షురాలు హాలీమా యాకోబ్. ఆమె ఆరేళ్ల పదవీకాలం సెప్టెంబర్ 13తో ముగియనుంది. ఈమె సింగరేపూర్‌కు తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు.
గతంలో ఇద్దరు భారత సంతతికి చెందిన వారు ప్రెసిడెంట్‌గా పని చేశారు. 1981 నుంచి 1985 వరకు కేరళకు చెందిన దేవన్ నాయర్ సింగపూర్ 3వ అధ్యక్షుడిగా సేవలు అందించారు. అనంతరం 2009లో భారత సంతతి (తమిళనాడు )కి చెందిన చెందిన సెల్లపన్ రామనాథన్ సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా ధర్మాన్ షణ్ముగరత్నం సింగపూర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. షణ్ముగరత్నంపై ఇద్దరు చైనా సంతతి నాయకులు పోటీకి దిగారు. సెప్టెంబర్ 13 తర్వాత షణ్ముగరత్నం సింగపూర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆరేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.