Jagan
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

అమరావతి 3 రాజధానుల కేసుపై సుప్రీం ఏం చెప్పిందంటే..

సుప్రీంకోర్టులో జగన్ సర్కార్‌కు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలను సైతం సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది.

సుప్రీంకోర్టులో జగన్ సర్కార్‌కు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలను సైతం సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్ల విచారణ ఈ ఏడాది డిసెంబర్‌కు వాయిదా వేసింది. ఆ లోపు ఈ కేసు విచారణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

కేసు అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కోరారు. అత్యవసరంగా విచారణ సాధ్యం కాదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బేలా ఎం త్రివేది ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆగస్ట్ నుంచి నవంబర్‌ వరకూ రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నందున అత్యవసర విచారణ సాధ్యపడదని స్పష్టం చేసింది. అమరావతి కేసుపై వాదనలు వినిపించేందుకు 3 గంటల సమయం కావాలని సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ కోరారు. ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తయిందా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

ప్రతివాదుల్లో ఇద్దరు చనిపోయారని అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు వెల్లడించారు. చనిపోయినవారిని జాబితా నుంచి తొలగించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. చనిపోయినవారిని జాబితా నుంచి తొలగించినట్టయితే మిగిలిన అందరికీ నోటీసులు అందినట్టేనని వెల్లడించింది. ఇంకా మరికొందరికి నోటీసులు అందలేదని అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు చెప్పారు. నోటీసులు అందని ప్రతివాదులందరికీ నోటీసులు పంపాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను లీడ్ మ్యాటర్‌గా పరిగణిస్తూ తదుపరి విచారణను ఈ ఏడాది డిసెంబర్‌కు వాయిదా వేసింది.