రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి కారణం వాలంటీర్లేనంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు స్పందించారు. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారని.. పట్టించుకోవద్దని వాలంటీర్లకు సూచించారు.
ఏపీలో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. పవన్ కామెంట్స్ వాలంటర్లతోపాటు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. స్వచ్ఛందంగా సేవలందించే వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ మహిళా కమీషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలపై 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. లేకపోతే క్షమాపణలు కోరాలని పేర్కొంది. ఈ విషయంపై పూర్తి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా.. ప్రజలపైనా ఉందన్నారు.
తాజాగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూడా పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. వాలంటీర్లకు మద్దతుగా నిలిచారు. వాలంటరీ వ్యవస్థ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువేనని అన్నారు. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారని.. అలాంటి వ్యాఖ్యలను మనం పట్టించుకోకూడదన్నారు. వాలంటీర్లు అందరూ ధైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు.
రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని అభినందించారు రాయుడు. వాలంటరీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫ్లాగ్ షిప్ అని.. దేశంలో 70 ఏళ్ల నుంచి జరగనది మన రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతోందని కొనియాడారు. ప్రతి మనిషికి ఏది అందాలో అది వాలంటీర్ల ద్వారా అందుతుందని చెప్పారు. కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను అడ్డుపెట్టి సేవలు అందించారని.. వారిని జీవితాంతం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని కోరారు. వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు ఒక గొప్ప ఆలోచన అని అన్నారు. వాలంటీర్ల ద్వారా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందన్నారు. వాలంటరీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో తప్ప దేశంలో ఎక్కడా లేదని గుర్తుచేశారు.
పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..
రాష్ట్రంలో గ్రామాల్లోని వాలంటీర్లు ఇంటింటి సర్వే చేస్తూ.. ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి..? ఏ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు..? ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా..? వితంతువులున్నారా లేదా అనే వివరాలను సేకరించి సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడమే కాకుండా వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత నాలుగేళ్ల పాలనలో 29 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని అన్నారు. వీరిలో 14 వేల మంది ఇళ్లకు చేరారని పోలీసులు చెబుతున్నారని.. మిగిలిన 15 వేలమంది మహిళల ఆచూకీ ఎక్కడని ప్రశ్నించారు. మహిళల అదృశ్యానికి కారణం వాలంటీర్లేనని కేంద్ర నిఘా వర్గాలు తనతో చెప్పాని అన్నారు.