election-Commission
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఏపీ ఎన్నికల అధికారికి ఈసీ పిలుపు-ముందస్తు లీకుల వేళ కీలక పరిణామం.. !

ఏపీలో ఓవైపు ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అదే సమయంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఈ తరుణంలో భారీగా ఓట్ల గల్లంతు ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. అధికార వైసీపీ నేతల ప్రభావంతో బీఎల్వోలు తమ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ విపక్షాలు ఫిర్యాదులు చేస్తున్నాయి. వీటిపై స్పందించి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్ కుమార్ మీనా పలు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు వచ్చింది.

ఏపీలో ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్ల నమోదుపై కేంద్ర ఎన్బికల సంఘం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఏపీలో ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో దీనిపై సీఈసీ స్పందించింది. తక్షణమే ఢిల్లీకి రావాలంటూ ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాకు పిలుపు వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తనతో పాటు ఏపీ ఓటర్ల జాబితాతోపాటు కీలక ఫైళ్లు తీసుకురావాలని సీఈసీ.. మీనాను ఆదేశించినట్లు తెలుస్తోంది.

దీంతో ముకేశ్ కుమార్ మీనా కీలక ఫైళ్లతో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం సీఈసీ అధికారులతో మీనా భేటీ అయి ఓట్ల గల్లంతు వ్యవహారంపై వివరణ ఇవ్వబోతున్నారు. ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్ల నమోదుపై వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తాను తీసుకున్న చర్యల్ని మీనా సీఈసీ అధికారులకు వివరిస్తారు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న ఓట్ల జాబితా సవరణ ప్రక్రియపైనా వివరాలు అందించబోతున్నారు.

రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్లో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దమవుతున్నట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైసీపీ సర్కార్ మాత్రం దీన్ని ఖండిస్తోంది. అయినా ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడటం లేదు. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అడుగులే. కర్నాటక ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా మారుతున్న పరిస్దితుల్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా ఏపీ, తెలంగాణకు కూడా డిసెంబర్లో ఎన్నికలు పెడతారన్న ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఈవోను సీఈసీ పిలిపించుకుని మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.