ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎడ్‌టెక్ స్టార్టప్‌లో ఒకటైన, కరోనావైరస్ సంక్షోభంలో విపరీతంగా పెట్టుబడులను ఆకర్షించిన బైజూస్ నేడు దెబ్బ మీద దెబ్బల నడుమ చతికిలపడింది. భారతీయ స్టార్టప్‌లకు ‘బైజూస్ కథ’ ఒక గుణపాఠం కావాలని నిపుణులు చెబుతున్నారు.
‘‘అతి తక్కువ కాలంలో అత్యధిక వేగంతో అభివృద్ధి చెందిన సంస్థ’’గా బైజూస్‌ను శ్రీరామ్ సుబ్రమణియన్ చెప్పారు. ఓ కార్పొరేట్ గవర్నెన్స్, అడ్వైజరీ సంస్థకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు.
2011లో మొదలైన బైజూస్ 2015లో లెర్నింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. 2018 నాటికి 1.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో యూనికార్న్ (ఒక బిలియన్ డాలర్ల కంటే విలువైన సంస్థగా)గా బైజూస్ చరిత్ర సృష్టించింది.
కోవిడ్-19 వ్యాప్తి నడుమ ఆన్‌లైన్ క్లాసుల వైపు పిల్లలు చూడటంతో సంస్థ మరింత విస్తరించింది. అయితే, 2021లో 327 మిలియన్ల డాలర్లు (రూ.2.70 లక్షల కోట్లు) నష్టాలను సంస్థ చూసింది. ఆ మునుపటి ఏడాది కంటే ఇది 17 రెట్లు ఎక్కువ.
అప్పటి నుంచి వరుస వైఫలయ్యాలను సంస్థ మూట కట్టుకుంటూనే ఉంది. నిరుడు 22 బిలియన్ డాలర్లు (1.82 లక్షల కోట్లుగా)గా ఉన్న కంపెనీ విలువ ప్రస్తుతం 5.1 బిలియన్ డాలర్లు (రూ. 42,124 కోట్లు)కు పరిమితమైంది. దీనికి కారణం సంస్థలో అతిపెద్ద ఇన్వెస్టర్, షేర్‌హోల్డర్ ‘ప్రోసస్ ఎన్‌వీ’ గ్రూపు తమ వాటాను భారీగా తగ్గించుకోవడమే.
‘‘కరోనావైరస్ మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లు ఎత్తివేయడంతో పిల్లలు స్కూలుకు వెళ్లడం మొదలుపెట్టారు. అప్పటి నుంచే తిరోగమనం మొదలైంది. కానీ, మదుపరులు మాత్రం బైజూస్‌లో పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. తిరోగమనం నుంచి వస్తున్న సంకేతాలను వారు గ్రహించలేకపోయారు’’ అని సుబ్రమణియన్ చెప్పారు.
పేపర్ల మాత్రమే బైజూస్ పురోగతి కనిపించేదని, వాస్తవంలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉండేవని ఏంజెల్ ఇన్వెస్టర్, బైజూస్ విధానాలను జాగ్రత్తగా గమనించిన అనిరుద్ధ మాల్పనీ అన్నారు.
‘‘కంపెనీ అసలైన విలువ, మార్కెట్‌లో చూపిస్తున్న విలువ మధ్య చాలా తేడా ఉండేది.’’ అని ఆయన చెప్పారు.
కరోనావైరస్ మహమ్మారి నడుమ సంస్థ భారీ వృద్ధిని చూసింది. దీంతో 2021లో వైట్ హ్యాట్ జూనియర్, ఆకాశ్, ఎపిక్, గ్రేట్ లెర్నింగ్ లాంటి స్టార్టప్‌లను వరుసగా సంస్థ తనలో కలిపేసుకుంది. దీని కోసం 2 బిలియన్ డాలర్లు (రూ.16,519 కోట్లు) ఖర్చు పెట్టింది.
ఆ తర్వాత డిజిటల్ పేమెంట్స్ వేదిక పేటీఎంను తోసిరాజని భారత్‌లోని అత్యంత విలువైన స్టార్టప్‌గా చరిత్ర సృష్టించింది.
కోట్ల రూపాయలను మార్కెటింగ్‌పై బైజూస్ ఖర్చుపెట్టింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్, ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకొంది. మరోవైపు ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రధాన స్పాన్సర్లలో ఒకరిగా, 2022 ఫిఫా వరల్డ్ కప్ అఫీషియల్ స్పాన్సర్‌గా మారింది.
కానీ, ఇటీవల కాలంలో పిల్లల తల్లిదండ్రులు వరుసగా దీనిపై ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. తమ స్థోమతకు మించి కోర్సులు కొనేలా తమపై ఒత్తిడి చేస్తున్నారని, ఆశించిన స్థాయిలో సేవలు కూడా ఉండటంలేదని ఆరోపణలు వచ్చాయి. కొందరైతే కస్టమర్లను దోచుకునేందుకు సంస్థ అనైతిక విధానాలను అనుసరిస్తోందని కూడా ఆరోపణలు చేశారు.
కోర్సులను విక్రయించాలని తమపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని, అసలు చేరుకోలేని భారీ లక్ష్యాలను తమకు నిర్దేశిస్తున్నారని కొందరు మాజీ ఉద్యోగులు కూడా మీడియాతో చెప్పారు. మరోవైపు ఖర్చులను తగ్గించుకునే పేరుతో వేల మంది ఉద్యోగులను సంస్థ విధుల నుంచి తొలగించింది.
అయితే, పిల్లల తల్లిదండ్రులతోపాటు మాజీ ఉద్యోగులు చేసిన ఆరోపణలను బైజూస్ ఖండించింది. సంస్థపై కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ మొదలుపెట్టింది.
విదేశీ మారకపు చట్టాలను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలపై గత ఏప్రిల్‌లో బెంగళూరులోని సంస్థ కార్యాలయంలో అధికారులు సోదాలు చేపట్టారు. అయితే, తాము ఎలాంటి తప్పూ చేయలేదని, ఇక్కడి అన్ని చట్టాలను తాము అనుసరిస్తున్నామని బైజూస్ పేర్కొంది.
మే నెలలో కంపెనీకి రుణాలు ఇచ్చిన సంస్థలు అమెరికాలో కోర్టును ఆశ్రయించాయి. తమకు చెల్లింపులు చేయడంలేదని, లోన్ అగ్రిమెంట్‌లో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆ సంస్థలు ఆరోపణలు చేశాయి. మరోవైపు సంస్థ ఆర్థిక నివేదికలను కూడా సమయానికి విడుదల చేయడంలేదని చెప్పాయి. అంతేకాదు, సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ఆల్ఫా అనే సంస్థకు భారీగా నిధులను మళ్లిస్తున్నారని కూడా ఆరోపించాయి. అయితే, ఈ ఆరోపణలను బైజూస్ ఖండించింది.
జూన్ నెలలో దాదాపు 40 మిలియన్ డాలర్లు (రూ.330 కోట్లు) వడ్డీని కూడా సంస్థ చెల్లించడం ఆలస్యమైంది. అదే సమయంలో రుణాలు ఇచ్చే సంస్థలు తమను వేధిస్తున్నాయంటూ సంస్థ కోర్టుకు వెళ్లింది.
ఆ తర్వాత మరోసారి వేల సంఖ్యలో ఉద్యోగులను సంస్థ తొలగించింది. అయితే, సొంత ఆడిటర్ల నుంచే సంస్థకు కొత్త సమస్యలు వచ్చాయి.
ఆర్థిక నివేదికలను సమర్పించడంలో బైజూస్ ఆలస్యం చేస్తోందని చెబుతూ ఆడిటర్ బాధ్యతల నుంచి డెలాయిట్ హస్కిన్స్, సెల్స్ లిప్ సంస్థలు తప్పుకున్నాయి. కంపెనీ రికార్డులను పరిశీలించడం తమకు కష్టం అవుతోందని ఆ రెండు సంస్థలూ చెప్పాయి.
ఈ వార్తల నడుమ బోర్డు సభ్యుల్లో ముగ్గురు రాజీనామా చేశారు. దీంతో బైజూస్ సీఈవో బైజు రవీంద్రన్, ఆయన భార్య దివ్య గోకుల్‌నాథ్, సోదరుడు రిజు రవీంద్రన్‌లు మాత్రమే బోర్డులో మిగిలారు.
ప్రస్తుతం రుణాల నిబంధనల్లో మార్పుల కోసం సంస్థ చర్చలు జరుపుతోంది.