పాకిస్థాన్ ప్రధాని కుమారుడు, మరి కొందరిపై 2020 నవంబరులో అప్పటి ఇమ్రాన్ ఖాన్ సర్కారు మనీ ల్యాండరింగ్ కేసు నమోదుచేసింది. వీరి ఖాతాల్లోకి పదేళ్లలో వందల కోట్లు అప్పనంగా వచ్చి పడ్డాయని, వీటికి లెక్కా పత్రాలు లేవని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఆరోపించింది. కానీ, ఇప్పుడు మాత్రం ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాని షెహబాజ్ నిర్దోషిగా గతేడాది బయటపడటం గమనార్హం.
మనీల్యాండరింగ్ కేసులో (Money Laundering Case) నిందితులుగా ఉన్న పాకిస్థాన్ ప్రధాని (Pakistan PM) షెహబాజ్ షరీష్ (Shebaz Sharif) కుమారుడు సులేమాన్ షేబాజ్ (Suleman Shebaz) సహా పలువుర్ని ప్రత్యేక జిల్లా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. రూ.1,600 కోట్ల పీకేఆర్ మనీ ల్యాండరింగ్ కేసులో తమ పేర్లను తొలగించాలని కోరుతూ ప్రధాని కుమారుడు సులేమాన్ షేబాజ్, ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. అయితే, ఈ కేసులో కోర్డు అడిగిన 27 ప్రశ్నలకు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ (FIA) సమాధానమిచ్చినట్లు పాక్ పత్రిక నివేదించింది.
ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ప్రకారం.. డాక్టర్ రిజ్వాన్ నేతృత్వంలోని జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (JIT) మనీలాండరింగ్ విచారణను నిర్వహించిందని ఎఫ్ఐఏ తరపు న్యాయవాది బఖ్త్ ఫఖర్ బెహ్జాద్‌కు తెలిపారు. అలాగే, దర్యాప్తు సమయంలో ఏదైనా సాక్షి ద్వారా లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారా? అని కోర్టు ప్రశ్నించగా.. విచారణ అధికారి అలీ మార్డాన్ మౌనంగా ఉన్నారని పేర్కొంది. అంతేకాదు, విచారణ సమయంలో తమ వైఖరిని మార్చుకున్న వారిపై తీసుకున్న చర్యల గురించి కూడా కోర్టు ప్రశ్నించింది. దీనికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విచారణ అధికారి సమాధానమిచ్చారు.
అయితే, మనీలాండరింగ్‌కు సంబంధించి సులేమాన్‌కు వ్యతిరేకంగా ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేవని కోర్టుకు ఎఫ్ఐఏ తరఫు లాయర్ తెలియజేశారు. దీంతో సులేమాన్‌పై ఎందుకు కేసు నమోదు చేశారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. అతడి ఖాతాలో భారీగా డబ్బు జమ అవుతోందని, ఆపై విత్‌డ్రా చేస్తున్నారని సమాధానమిచ్చారు. తాము ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని నిందితులు సమర్పించిన పిటిషన్లను కోర్టు అంగీకరించింది. సులేమాన్, ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.
పాక్ ప్రధాని షెహబాజ్, అతడి ఇద్దరు కుమారులు హంజా, సులేమాన్ 2008- 2018 మధ్య 28 బ్యాంకు ఖాతాల ద్వారా సుమారు 16.3 బిలియన్ల అవినీతి, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో కేసు నమోదుచేశారు. ఇమ్రాన్ ఖాన్ హయాంలో నవంబర్ 2020లో అభియోగాలు నమోదయ్యారు. అయితే 2022 అక్టోబర్‌లో షెహబాజ్, హమ్జా ఈ కేసు నుంచి నిర్దోషులుగా విడుదలయ్యారు.