helicopter
అంతర్జాతీయం ముఖ్యాంశాలు

కుప్పకూలిన హెలికాప్టర్: ఆరుగురు మృతి, ఎవరెస్ట్ సమీపంలో మృతదేహాలు లభ్యం

నేపాల్‌లో గల్లంతైన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ఉదంతం విషాదాంతమైంది. గల్లంతైన ఆ హెలికాప్టర్ కుప్పకూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఐదుగురు మెక్సికన్‌లతో సహా మొత్తం ఆరుగురు ఉన్నారని చెప్పారు. వీరంతా మృతి చెందినట్లు తెలుస్తోంది. గాలింపు చేపట్టిన సహాయక బృందాలు పైలట్ తోపాటు ఐదుగురు మెక్సికన్ల మృతదేహాలను గుర్తించాయి.

సోలుకుంభు నుంచి ఖాట్మాండ్‌కు ప్రయాణిస్తుండగా.. ఎవరెస్ట్ శిఖరం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 9ఎన్ఏఎంవీ కాల్ సైన్‌తో వ్యవహరించే ఈ హెలికాప్టర్.. సోలుకుంభులోని సుర్కీ అనే ప్రదేశం నుంచి గాల్లోకి ఎగిరిన 15 నిమిషాల తర్వాత కంట్రోల్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయాయి. మంగళవారం ఉదయం 10 గంటల ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.

కాగా, సీనియర్ పైలట్ చెట్ గురుంగ్ ఈ హెలికాప్టర్‌‌ను నడిపారని చెప్పారు. ఆయనతోపాటు ఐదుగురు మెక్సికోకు చెందిన ప్రయాణికులు ఉన్నారు. ఎవరెస్ట్ శిఖరానికి సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయాలను నేపాల్ సివిల్ ఏవియేషన్ అధికారి జ్ఞానేంద్ర భుల్ అక్కడి మీడియాకు తెలిపారు. ఆ హెలికాప్టర్‌లో అమర్చిన జీపీఎస్ సంకేతాలు లమ్మురాపాస్ వద్ద నిలిచిపోయినట్లు చెప్పారు.

ఇది ఇలావుంగా, లిఖుపికే రూరల్ మున్సిపాలిటీ ప్రాంతంలో భారీ శబ్ధం వినిపించిందని స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడికి అధికారులు, భద్రతా దళాలు చేరుకున్నాయి. హెలికాప్టర్ కుప్పకూలినట్లు గుర్తించారు. పైలట్ చెట్ గురుంగ్ తోపాటు మరో ఐదుగురు మెక్సికన్ల మృతదేహాలను ఘటనా స్థలంలో గుర్తించారు. కాగా, ఈ ఏడాది జనవరిలో ఖాట్మాండ్ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు వెళ్తున్న యతి ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానం కుప్పకూలడంతో 72 మంది మరణించారు.