ఏడాది తిరిగే సరికి ప్రస్తుతమున్న వాసాలమర్రి.. బంగారు వాసాలమర్రి కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. వాసాలమర్రి గ్రామ సందర్శనలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు.
ఈ ఊరికి కనీసం తాను ఇంకో 20 సార్లు వస్తాను. వచ్చేసారి ఇలా సభ పెట్టను. మీ ఊరిలో నలుగురు మాత్రమే పరిచయం అయ్యారు. అందరూ పరిచయం అయ్యేలా సభ పెట్టాలి. అందరం పట్టుబడితే వాసాలమర్రి ఏడాది నాటికి బంగారు వాసాలమర్రి కావాలి. ఊరిలో పోలీసు కేసులు ఉండొద్దు. వెంటనే పరిష్కారం చేసుకోవాలి. ఒకర్ని చూస్తే మరొకరు చిరునవ్వు నవ్వాలి. ఒకరికొకరు సహకరించుకునే ప్రేమ ఏర్పడాలి. గ్రామంలో ఐకమత్యం, పట్టుదల అవసరం. కష్టం, బాధ ఎవరిదైనా ఒకటే అనే భావన ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్‌గా ఉంటుంది.. అన్ని పనులు జరగాలి. ఇవన్నీ సాధ్యమైతే వందకు వంద శాతం వాసాలమర్రి బంగారంలా తయారవుతుంది.
గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ నాయకత్వంలో అద్భుతమైన పని జరగాలి. ఆకుల ఆగమ్మ, చిన్నూరి లక్ష్మీతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆగమ్మ అల్ల నేరేడు పండ్లు ఇచ్చారు. అల్ల నేరేడు చెట్టు లేకుండా ఊరు ఉంటదా? ఇక అన్ని చెట్లు నాటాలి. ప్రత్యేకమైన పని జరగాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.