తెలంగాణ ముఖ్యాంశాలు

పంచాయతీ నిధుల ఆడిట్‌లో తెలంగాణ ఆదర్శం

  • కేంద్ర మంత్రి తోమర్‌ ప్రశంస
  • అన్ని రాష్ర్టాలు అనుసరించాలని సూచన

గ్రామ పంచాయతీ నిధుల ఆడిట్‌కు తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న ఆన్‌లైన్‌ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేంద్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ కొనియాడారు. మంగళవారం ఆయన రాష్ర్టాల ఆడిట్‌, ఆర్థిక, పంచాయతీరాజ్‌ విభాగాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్రసింగ్‌ తోమర్‌ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ ఆడిట్‌పై తెలంగాణ అధికారులు ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను ప్రశంసించారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఆన్‌లైన్‌ ఆడిట్‌ దోహదపడుతుందన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించే నిధులను 100 శాతం ఖర్చు చేయాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించి గ్రామాలు అభివృద్ధి జరిగేలా చూడాలని కోరారు. కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ర్టాలు తెలంగాణను స్ఫూర్తిగా తీసుకోవాలని, గ్రామ పంచాయతీల నిధులను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఆడిట్‌ చేయాలని ఆదేశించారు. సమావేశంలో తెలంగాణ అధికారులు రాష్ట్రంలో అమలవుతున్న ఆన్‌లైన్‌ ఆడిట్‌ విధానాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు వివరించారు. 2019-20లో 12,769 గ్రామ పంచాయతీలకుగాను 5,174 పంచాయతీల నిధులను ఆన్‌లైన్‌ ఆడిట్‌చేసి నివేదికలు సిద్ధం చేశామన్నారు. 2020-21కి సంబంధించిన ఆడిట్‌ను ఇప్పటికే ప్రారంభించామని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న విధానంపై తోమర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. అనంతరం జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ) తయారు చేసిన సోషల్‌ ఆడిట్‌ విధివిధానాలను ఆయన ఆవిష్కరించారు.