ప్రత్యేక హోదా బ్రహ్మ పదార్ధం కాదని, ఆంధ్రప్రదేశ్‌కు హోదాకు మించిన లబ్దిని కేంద్రంలోని బీజేపీ చేకూర్చిందని పార్టీ అధ్యక్షురాాలిగా బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేత కాకపోతే కేంద్రానికి అప్పగించాలన్నారు. పొత్తులపై నిర్ణయం అధినాయకత్వం చూసుకుంటుందన్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో ప్రత్యేక హోదాకు మించి ఏపీకి సాయం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురంధేశ్వరి అన్నారు. తన మీద నమ్మకంతో విశ్వాసంతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించిన జేపీ నడ్డాకు, సంఘటన మంత్రి సంతోష్, మోదీ, అమిత్‌షాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
సోము వీర్రాజు పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించారు. అందరికి సహకారంతో ముందుకు వెళ్తానని చెప్పారు. తనకంటే ముందుకు అధ్యక్షులుగా పనిచేసిన సోము వీర్రాజు, అంతకు ముందు 16మంది అధ్యక్షులుగా పనిచేశారని, వారి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందరి సహకారం మార్గ దర్శకత్వంలో ముందుకు వెళ్తానని చెప్పారు.
బీజేపీ అభివృద్దికి పెద్దపీట వేసి, అవినీతికిదూరంగా ఉండే పార్టీ అని, రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ సహకరించలేదనే దుష్ప్రచారం నడుస్తోందని, బీజేపీ మాత్రం దేశ అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని, ఓట్లతో సంబంధం లేకుండా సబ్‌కా సబ్‌కా నినాదంతోనే రాష్ట్రానికి సహకరించిందని చెప్పారు.
బీజేపీ పాలనలో అన్ని వర్గాల వారికి న్యాయం చేసిందని చెప్పారు. ఏపీలో అన్ని వర్గాల వారికి మేలు జరిగేలా రాష్ట్ర అభివృద్దికి సైతం సహకారం అందించినట్లు చెప్పారు. బీజేపీ అందించిన సహకారం మీద దృష్టి సారిస్తే, పేదలు కోరుకునే కూడు, గూడు,నీడ మీద ప్రధానంగా దృష్టి పెట్టిందని గుర్తు చేశారు.
జగన్ పేదలకు జవాబు చెప్పాలి…
దేశంలో పిఎం అవాస్ యోజన పథకంలో నాలుగు కోట్ల ఇళ్లు ఇస్తే, ఒక్క ఏపీలో 22 లక్షల ఇళ్లు కేటాయించినట్లు చెప్పారు. ఒక్కో ఇంటికి లక్షా 80వేలు కేంద్రం నుంచి ఇచ్చామన్నారు. ఈ లెక్కలో 32,500కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 9ఏళ్లలో 20వేల కోట్లను ఇళ్ల కోసం విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రం అందించిన సాయంతో ఈ పాటికి 65శాతం ఇళ్ల నిర్మాణం జరిగి ఉండాలని, కానీ 35శాతం ఇళ్లు కూడా ప్రభుత్వాలు కట్టలేదన్నారు.
అధికారంలో ఉన్న ప్రభుత్వం, పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లను కట్టి ఇవ్వాలని, ఇళ్ళ నిర్మాణంపై పేదలకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి ఏమిటో ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు. రోడ్ల పరిస్థితి ఏమిటో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని, రహదారుల మీద ప్రయాణిస్తుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుస్తుంది అన్నారు.
2014కు ముందు ఏపీలో 4119 కి.మీల జాతీయ రహదారులు ఉంటే, 2022 జనవరికి 8613 కి.మీ చేరాయని వివరించారు. లక్షా 15వేల కోట్ల రుపాయలు రహదారి నిర్మాణానికి ఖర్చు చేశామని చెప్పారు.రాష్ట్రంలో జాతీయ రహదారులు రెట్టింపు అయ్యాయన్నారు. జాతీయ రహదారులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రోడ్లు నిర్మించిందో చెప్పాలన్నారు. జాతీయ రహదారుల్లో భాగంగా 1470 కోట్లు మచిలీపట్నం-విజయవాడ మార్గానికి ఖర్చు చేశారని, కర్నూలు-మైదుకూరుకు 2వేల కోట్లు, విజయవాడ -బెంగుళూరుకు రాయలసీమ మార్గానికి 1900కోట్లు, విజయవాడ బైపాస్ కోసం రూ.1600కోట్లు ఖర్చు చేశామన్నారు. గొల్లపూడి నుంచి గన్నవరంకు మరో రూ.1120కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో కేంద్రం చేసిన అభివృద్ది మాత్రమే కనిపిస్తుందన్నారు.
రెండేళ్లలోనే విభజన హామీలు…
విభజన చట్టం ప్రకారం ఐదేళ్లలో స్థాపించాల్సిన విద్యా సంస్థల్ని, బిల్లు అమోదం పొందిన రెండేళ్లలోనే ఏర్పాటు చేశామన్నారు. జాతీయ విద్యా సంస్థలు అన్నింటిని ఏర్పాటు చేశామని చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్ కు రూ.1600కోట్లు, తిరుపతి ఐఐటీకి రూ.700కోట్లు, విశాఖ ఐఐఎంకు రూ.680 కోట్లు, ట్రిపుల్ ఐటీకి రూ.130కోట్లు ఎన్‌ఐటికి రూ. 300కోట్లు, ఓసియన్ టెక్నాలజీకి సంస్థకు రూ.250కోట్లు , నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్‌కు రూ.600కోట్లు ఇచ్చిందన్నారు.
ఏపీలో రెండేళ్ల వ్యవధిలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్ని కేంద్రం ఏర్పాటు చేసిందని పురంధేశ్వరి వివరించారు. తొలి ఐదేళ్లలోనే విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడప,కర్నూలులో ఎయిర్ పోర్టుల్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.
ఏపీలో పరిశ్రమలు వెనక్కి…
పరిశ్రమలు ఉంటే మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని భావిస్తే, ఏపీలో పెట్టుబడులు వెనక్కి తీసుకుని వెళ్లే పరిస్థితి ఉందన్నారు. ఇక్కడి పరిస్థితులకు భయపడి వెనక్కి తీసుకుని వేరే రాష్ట్రానికి వెళ్లాయన్నారు. జాకీ అలా వెళ్లిపోయిందని, 3వేల కోట్లు పెట్టుబడి కోయంబత్తూరుకు వెళ్లిందన్నారు.
రాష్ట్రం సహకరిస్తేనే కేంద్రం ఏమైనా చేయగలుగుతుందన్నారు. వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి, 4211కోట్ల ఖర్చుతో చెన్నై కారిడార్ డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ,మదనపల్లి, శ్రీకాకుళం, కొప్పర్తిలో పారిశ్రామిక నోడ్స్ వస్తాయని, రాష్ట్రం సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం సహకరించకుండా కేంద్రం వాటిని ముందుకు తీసుకు వెళ్లలేదన్నారు. భూసేకరణ రాష్ట్రమే చేయాల్సి ఉంటుందన్నారు.
కనిగిరిలో నేషనల్ ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌కు మద్దతు తెలిపామని, అదే జోన్ రాజస్థాన్‌లో 25వేల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే వచ్చాయని, ఏపీలో కనీసం పనులు కూడా మొదలు కాలేదన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉందన్నారు.
గ్రామీణాభివృద్ధికి నిధులు…
గ్రామీణ ప్రాంతంలో జరిగే అభివృద్ధి మొత్తానికి వనరులు గ్రామీణాభివృద్ధి పథకం నుంచి అందుతోందన్నారు.2020-21లో రూ.10,325కోట్లు , 21-22లో రూ.7180 కోట్లు, 22-23లో రూ. 8270కోట్లు ఇచ్చారన్నారు. ఏపీలో ఆర్బీకేలు, సచివాలయాలు, భూములు చదను చేసే పనులకు కూడా ఎన్‌ఆర్‌ఈజీపీ నిధులు వాడుకుంటున్నారని చెప్పారు.
కరోనా సమయంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో ప్రతి ఒక్కరికి 5కిలోల బియ్యం, కిలో పప్పు అందిస్తున్నారని, ఇలా రాష్ట్రంలో 90లక్షల మందికి ఉచిత బియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా 2020-21 రూ.8500కోట్ల రుపాయలు, 21-22లో 9,300కోట్లు, 22-23లో 10,300కోట్ల విలువైన బియ్యం వచ్చిందని చెప్పారు.
రైతులకు సాయం చేసే విసయంలో కూడా జగన్ మోసం చేశాడని, 12వేలు రైతులకు పెట్టుబడిగా ఇస్తామని చెప్పారని, సిఎం ఇస్తున్నారో లేదో జవాడు చెప్పాలన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బును కలిపి రైతు భరోసా ఇస్తున్నారని పురంధేశ్వరి ఆరోపించారు. రైతుల్ని మోసం చేస్తున్నారని, 49లక్షలమంది రైతులకు కేంద్రం నేరుగా లబ్ది చేకూర్చినట్లు చెప్పారు.
స్మార్ట్ సిటీల్లో భాగంగా అమరావతికి 480కోట్లు, కాకినాడ, తిరుపతి,వైజాగ్ ప్రతి నగరానికి రూ.400కోట్లు ఇచ్చామన్నారు. ఏపీలో 72 రైల్వే స్టేషన్లను ఆధునీకరించి, విస్తరించినట్లు చెప్పారు. రాష్ట్రంలో రైల్వే లైన్ల ఆధునీకరణ మొత్తం కేంద్రమే చేపట్టినట్టు చెప్పారు.
యూపీఏ హయంలో టాక్స్ రెవిన్యూలో 32శాతం మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చేదని, ఎన్డీఏ వచ్చాక 42శాతానికి పెరిగిందని గుర్తు చేశారు. 2023-24లోలో 41,300కోట్లు ఆదాయం వచ్చేఅవకాశం ఉందని, గ్రాంట్ల రూపంలో 46వేల కోట్ల వరకు వస్తాయని చెప్పారు.
2021-26 మధ్య రూ.23వేలకోట్లరుపాయలు లోటు సర్దుబాటు చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందన్నారు. గ్రామీణ అభివృద్ధి మీద దృష్టి సారించి నేరుగా నిధులు ఇవ్వాలని కేంద్రం యోయిస్తే ఆ నిధులు కూడా రాష్ట్రం దారి మళ్లిస్తోందని ఆరోపించారు.
చేతకాకుంటే కేంద్రానికి అప్పగించాలి…
ఏపీ జీవనాడి అయిన పోలవరం విషయంలో కేంద్రం వెనకడుగు వేయలేదన్నారు. ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎప్పుడు జాప్యం చేయలేదని, ఇటీవల 12వేల కోట్లు కేంద్రం మంజూరు చేసిందని గుర్తు చేశారు. కేంద్రం మీద అభాండాలు వేస్తున్నారని, పోలవరం నేషనల్ ప్రాజెక్టు కాబట్టి, నిర్మాణాన్ని చేయలేకపోతే తిరిగి కేంద్రానికి ఇచ్చేయాలన్నారు.
చిన్న కాంట్రాక్టర్ల మీదే ప్రతాపం….
రివర్స్ టెండరింగ్ చేసి అవినీతికి తావు లేకుండా చేస్తానని,రాష్ట్రంలో ఉన్న చిన్నాచితక కాంట్రాక్టర్ల మీద మాత్రమే జగన్ ప్రతాపం చూపించారన్నారు. కాంట్రాక్టర్లకు రూ.40-50వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, ఇద్దరు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. బాపట్లలో 15ఏళ్ల బాలుడిని పెట్రోల్ పోసి చంపేశారని, సొంత బాబాయిని చంపిన కేసు ఏమైందని ప్రశ్నించారు.
దిశ యాక్ట్ తెచ్చామని ప్రజల్ని మభ్య పెట్టారని, మహిళలు ఫోన్లు ఊపినా రక్షణ లేకుండా పోయిందన్నారు. విశాఖలో ఎంపీ భార్యా,కొడుకును కిడ్నాప్ చేసినా రక్షణ లేకుండా పోయిందన్నారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఆరోపించారు.
రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం తెస్తామన్నారని, ఇప్పుడు నాణ్యత లేనిమద్యం విక్రయిస్తూ, ఇళ్లు గుల్లైనా,పుస్తెలు తెగినా ఫర్లేదన్నట్టు మద్యం అమ్మకాలు సాగుతోందన్నారు. డిస్టిలరీ నుంచి నాణ్యత లేని మద్యం కొనుగోలు చేసి ముడుపులు తీసుకుంటున్నారని పురందేశ్వరి ఆరోపించారు.
ఇసుక విషయంలో ఒకే ఒక్క కంపెనీకి గుత్తాధిపత్యం ఇచ్చారని, మైనింగ్ మొత్తాన్ని కావాల్సిన వారికి మాత్రమే దక్కేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిర్మాణ రంగం కుదేలైందని, భవన నిర్మాణ రంగం నాశనం కావడానికి ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ప్రభుత్వ భూములు ఉన్న చోట చుక్కల భూములుగా వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
హోదా కంటే ఎక్కువ మేలు చేశాం….
ప్రత్యేక హోదాకు దీటుగా రాష్ట్రానికి చాలా మేలు కేంద్రం చేసిందన్నారు. ప్రత్యేక హోదా బ్రహ్మ పదార్ధం కాదని, ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ చాలన్నారని గతంలో ప్రభుత్వాలు చెప్పాయని గుర్తు చేశారు. ప్యాకేజీలో హోదా కింద వచ్చే అన్ని విషయాలను పొందుపరిచారన్నారు. అరుణ్ జైట్లీ గారు అన్ని అంశాలను స్పష్టంగా పొందు పరిచారని చెప్పారు. దాని అమలు ఆలస్యమైందన్నారు.
పోలవరం ప్రాజెక్టులో పరిహారం చెల్లింపు విషయంలో రాష్ట్ర వైఖరి వల్లే ఆలస్యమన్నారు. బాధితుల విసయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదని క్లారిటీ ఇస్తే కేంద్రం తప్పకుండా స్పందిస్తుందని చెప్పారు. గతంలో ఇరిగేషన్ పార్ట్ కు మాత్రమే అనుమతించారని, గజేంద్ర సింగ్ షెకావత్ ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నారని చెప్పారు.
రాజకీయాల్లో వేర్వేరు పార్వ్శాలు ఉంటాయని, పార్టీని బలోపేతం చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు.ఏపీలో పొత్తులు పైవాళ్లు చూసుకుంటారని, ప్రజా వ్యతిరేక సమస్యలపై తమ గళం ఎలా విప్పాలనేది మాత్రమే తాము చూసుకుంటామని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ తమ మిత్రపక్షమేనని,సోము వీర్రాజు కూడా పవన్‌తో నిరంతరం సంప్రదిస్తూనే ఉన్నారని గుర్తు చేశారు.