జాతీయం ముఖ్యాంశాలు

PM Modi : సబ్‌ ఖేలే.. సబ్‌ ఖిలే.. మన్‌ కీ బాత్‌లో మోదీ

‘టోక్యో ఒలింపిక్స్‌ ద్వారా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆటల గురించే చర్చించుకోంటున్నారు. ఇది శుభపరిణామం. ప్రతి కుటుంబం ఇలాగే ఆలోచిస్తూ క్రీడల్లో ముందడుగు వేసేలా భవిష్యత్‌ తరాన్ని ప్రోత్సహించాలి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా ఆయన సేవలను మోదీ గుర్తుకుచేసుకున్నారు. ఈ సందర్భంగా ‘సబ్‌ ఖేలే.. సబ్‌ ఖిలే’ అనే కొత్త నినాదాన్ని ప్రజలకు ఇచ్చారు.

‘ధ్యాన్‌చంద్ జీ ఆత్మ ఎక్కడ సంతోషంగా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. ధ్యాన్ చంద్ హాకీ ప్రపంచంలో భారత హాకీని అంత ఎత్తున నిలిపారు. 4 దశాబ్దాల తర్వాత భారతదేశం పురుషులు, మహిళల జట్లు హాకీలో తమ ప్రావీణ్యాన్ని చూపి ప్రపంచం ఆశీస్సులను అందుకున్నారు. మన దేశం తరఫున ఎన్ని పతకాలు సాధించినా.. హాకీలో పతకం వచ్చినప్పుడే భారతీయుడు నిజమైన సంతోషం పొందుతాడు. ఈసారి హాకీలో పతకం వచ్చింది. ధ్యాంచంద్ జీ జీవితం క్రీడలకు అంకితం చేయబడినందున ఆయన ఆత్మ సంతోషంగా ఉంటుంది’ అని మోదీ తెలిపారు.

నేటి యువత విభిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారని మోదీ అన్నారు. ఒకరు తయారు చేసిన మార్గాన్ని అనుసరించడం వీరికి ఇష్టం లేదు. ఎవరికి వారు కొత్త మార్గాల్లో నడవాలనుకుంటున్నారు. వీరి గమ్యం, మార్గం, కోరిక కొత్తగా ఉంటున్నాయి. రానున్న రోజుల్లో అంతరిక్ష పరిశోధనల్లో పెద్ద సంఖ్యలో యువత పాల్గొంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. యువత రిస్క్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, చిన్న పట్టణాల్లోనూ స్టార్టప్స్‌ ప్రారంభించేందుకు ఉత్సుకత చూపించడం యువత ఆత్మస్థైర్యానికి నిలువుటద్దం అని చెప్పారు.