sifilis
అంతర్జాతీయం ముఖ్యాంశాలు

సిఫిలిస్: ఈ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ఎందుకు పెరుగుతోంది?

సెక్స్ వల్ల వ్యాపించే ఇన్ఫెక్షన్లలో వందల ఏళ్ల కిందట నుంచి ఉన్నవాటిలో సిఫిలిస్ ఒకటి. 1490లలో తొలి సిఫిలిస్ కేస్ నమోదు కాగా అప్పటి నుంచి ఈ వ్యాధిని అనేక పేర్లతో పిలుస్తున్నారు. ఫ్రెంచ్ వ్యాధి, నియోపాలిటన్ డిసీజ్, పోలిష్ వ్యాధి… ఇలా అనేక పేర్లున్నాయి దీనికి.

అయితే, ‘ది గ్రేట్ ఇమిటేటర్’ అనేది ఈ వ్యాధి విషయంలో ఎక్కువగా వినిపించే పేరు. అందుకు కారణం ఉంది. ఈ వ్యాధి లక్షణాలను తొలి దశలో గుర్తించడం చాలా కష్టం. వేరే వ్యాధుల లక్షణాలను పోలిన లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. దానివల్ల చికిత్స తీసుకోకపోవడమో, లేదంటే సరైన చికిత్స తీసుకోకపోవడమో జరిగి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.

ఆమ్‌స్టార్‌డామ్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేసే 33 ఏళ్ల తుషార్‌కు రెండు సార్లు సిఫిలిస్ వచ్చింది. తనకు ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు ఆయనకు మొట్టమొదట తన లైంగిక భాగస్వాముల వాట్సాప్ మెసేజ్‌తో తెలిసింది.

‘వారు నిజంగా అప్‌సెట్ అయ్యారు’ అని ఆయన చెప్పారు. ‘విండో పీరియడ్ కారణంగా వెంటనే వ్యాధి రావడం అసాధ్యమే అయినా వారు నన్ను నిందించారు. ఆరోపణలకు గురికావడం కూడా నాకు కొత్తగా అనిపించింది’.

ఆ వారంలోనే తుషార్‌కు పరీక్షలు చేసి చికిత్స అందించారు. ‘సిఫిలిస్ నయం కాదని చాలామంది పొరపాటు పడతారు. మనలో సిఫిలిస్ యాంటీబాడీలు ఉండటానికి, మనకు సిఫిలిస్ ఇన్ఫెక్షన్‌ను ఉండడానికి మధ్య తేడాను చాలామంది అర్థం చేసుకోలేరు’ అన్నారు తుషార్.

లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లకు సంబంధించిన డాటాను అమెరికా ఏప్రిల్‌లో విడుదల చేసింది. ఆ డాటా ప్రకారం చూస్తే సిఫిలిస్ కేసుల పెరుగుదల అధికంగా ఉంది. 2020, 2021 మధ్య కేసులు అత్యధికంగా 32 శాతం పెరిగాయి.

గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ అంటువ్యాధి కేసులు తగ్గుతున్నాయన్న సూచనలేమీ లేవని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) హెచ్చరించింది. అంతేకాదు.. ఒక్కసారిగా కేసులు పెరగడం వంటి కొత్త ధోరణులు కనిపిస్తున్నాయని సీడీసీ చెప్పింది.

పుట్టుకతోనే సిఫిలిస్ సోకిన కేసులూ ఎక్కువయ్యాయి. గర్భంతో ఉన్న మహిళకు సిఫిలిస్ ఉన్నట్లయితే పుట్టే బిడ్డకూ ఈ వ్యాధి సోకుతుంది. అలాంటి కేసులు ఎక్కువైనట్లు తాజా డాటా వెల్లడించింది. సిఫిలిస్ వల్ల గర్భంలోనే బిడ్డ చనిపోవడం, పుట్టిన కొద్దిరోజులకే మరణించడం, జీవితాంతం అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడడం వంటివి జరగొచ్చు.

‘15 నుంచి 20 ఏళ్ల కిందట మనం సిఫిలిస్‌ను నిర్మూలిస్తున్నాం అనుకున్నాం’ అన్నారు సీడీసీలో సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ విభాగంలో డైరెక్టరుగా పనిచేస్తున్న లియాండ్రో మెనా.

గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఎక్కువ కేసుల వృద్ధి రేటు కనిపిస్తోందని లియాండ్రో అన్నారు.

ఇది ఒక్క అమెరికాకే పరిమితం కాదు. 2020లో ప్రపంచవ్యాప్తంగా 71 లక్షల సిఫిలిస్ కేసులు కొత్తగా నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది.

బ్రిటన్‌లో 1948 తరువాత 2022లో అత్యధిక సంఖ్యలో సిఫిలిస్ కేసులు నమోదయ్యాయి.

క్షేత్ర స్థాయిలో పనిచేసే సెక్సువల్ హెల్త్ ప్రాక్టీషినర్స్‌కు ఈ కేసుల పెరుగుదల అనేది స్పష్టంగా తెలుస్తుంది.

‘2005లో నేను తొలిసారి సెక్సువల్ హెల్త్ నర్సింగ్ ప్రారంభించినప్పుడు సిఫిలిస్ ప్రాథమిక దశ కేసులు కనిపించడం అనేది చాలా అరుదుగా ఉండేది’ అని బ్రిటన్‌లో ఎస్‌టీఐ ఫౌండేషన్ కోచైర్ జోడీ క్రాస్‌మన్ చెప్పారు. ‘2020, 2021 మధ్య ఇక్కడ సిఫిలిస్ కేసులు 8.4 శాతం ఎక్కువగా పెరిగాయి.. నగరంలోని చాలా క్లినిక్‌లకు ఇప్పుడు రోజుకు రెండుమూడు కేసులు చికిత్స కోసం వస్తున్నాయి’ అన్నారు జోడీ.

ట్రెపోనెమా పాలిడమ్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. దీని లక్షణాలను నాలుగు దశలుగా వర్గీకరించారు.

మొట్టమొదటి దశలో.. సంభోగ ప్రదేశంలో నొప్పి లేని పుండ్లు, దద్దుర్లు ఏర్పడడం. ఈ దశలో కండరాలకు పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చి చికిత్స చేయొచ్చు. అయితే, సిఫిలిస్‌కు చికిత్స చేయకుండా వదిలేస్తే దీర్ఘకాలంలో నరాలు, గుండెకు సంబంధించిన వ్యాధులకు కారణమవుతుంది.

అమెరికాలో కెనడా సరిహద్దు ప్రాంతాలలో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నట్లు టొరంటో విశ్వవిధ్యాలయంలో అంటువ్యాధుల పరిశోధకుడు ఐజాక్ బోగోచ్ చెప్పారు.

2011 నుంచి 2019 మధ్య కాలంలో కెనడాలో సిఫిలిస్ కేసులు 389 శాతం పెరిగాయి. లైంగికంగా సంక్రమించే మిగతా వ్యాధులతో పోల్చితే సిఫిలిస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది.

స్వలింగ సంపర్కులైన మగవాళ్లు, ఆడామగా ఇద్దరితోనూ సంభోగంలో పాల్గొనే మగవాళ్లలో సిఫిలిస్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం మగవాళ్లలో సిఫిలిస్ కేసులు తగ్గుతున్నాయి. కెనడాలో కూడా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మగవాళ్లలో కేసుల రేటు తగ్గుతోంది.

మరోవైపు ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలలో పుట్టుకతో సిఫిలిస్ సోకుతున్న కేసులూ అధికంగా ఉన్నాయి. 2021లో అమెరికా వ్యాప్తంగా తల్లి నుంచి బిడ్డకు సిఫిలిస్ సోకిన కేసులు 30 వేలు నమోదయ్యాయి. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కానంత భారీ సంఖ్య అని ఆరోగ్య అధికారులు చెప్తున్నారు.

అమెరికాలో తల్లి నుంచి బిడ్డకు సిఫిలిస్ సోకిన కేసులు 2016తో పోల్చితే 2020లో 3.5 రెట్లు పెరిగాయి. 2021లో ఇలాంటి కేసులు మరింత పెరిగాయి. దీనివల్ల 220 గర్భస్థ శిశుమరణాలు, నవజాత శిశు మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో కొన్నిచోట్ల అసాధారణ స్థాయిలో సిఫిలిస్ కేసులు పెరిగిన విషయాన్ని జాతీయ గణాంకాలు కొంత దాచిపెట్టినట్లు కనిపిస్తోంది. పుట్టుకతో సిఫిలిస్ కేసులు మిసిసిపీలో గత అయిదేళ్లలో 900 శాతం పెరిగినట్లు డాక్టర్లు చెప్తున్నారు.

నల్లజాతి అమెరికన్‌లు, హిస్పానిక్ మహిళలలో సిఫిలిస్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

‘ఇది అమెరికా ప్రజారోగ్య వ్యవస్థలో, మౌలిక సదుపాయాలలో ఇప్పటికీ అంతర్లీనంగా ఉన్న అసమానత, జాత్యహంకారాన్ని ప్రతిబింబిస్తోంది’ అని విస్కాన్సిన్‌లోని మార్ష్‌ఫీల్డ్ క్లినిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్ట్ మారియా సుందరం చెప్పారు. ‘‘ఇంటిని కోల్పోయిన, మాదక ద్రవ్యాలకు బానిసలై దుర్బల స్థితిలో ఉండే మహిళలు ఎక్కువగా ఈ వ్యాధి ప్రభావానికి లోనవుతున్నారు’ అన్నారు మారియా. కోవిడ్-19తో ఇలాంటి అసమానతలు మరింత పెరిగాయి.

లైంగికంగా సంక్రమించే వ్యాధుల నియంత్రణ కోసం పనిచేసే వ్యవస్థలు కోవిడ్ సమయంలో దృష్టి పెట్టలేకపోవడం కూడా దీనికి కారణం కావొచ్చన్నారు మారియా.

లైంగికంగా సంక్రమించే వ్యాధుల నిర్ధరణ పరీక్షలు చేసే చోటికి వెళ్లగలగడం, సిఫిలిస్ చుట్టూ ఉన్న స్టిగ్మా, భాషాపరమైన అవరోధాలు వంటివన్నీ అసమానతలకు కారణమవుతున్నాయి. పుట్టుకతో సిఫిలిస్ సోకుతున్న కేసులు ఎక్కువగా పెద్దగా చదువుకోని నల్లజాతి మహిళలకు సంబంధించినవే ఉంటున్నాయని బ్రెజిల్‌లో చేసిన ఓ అధ్యయనంలో తేలింది.

కాలిఫోర్నియాలోని కెర్న్ కౌంటీలో చేపట్టిన ఓ అధ్యయనంలో.. గర్భిణులపై లైంగిక వేధింపులు, ఇమిగ్రేషన్ స్టేటస్, మెడికల్ ఇన్స్యూరెన్స్ స్టేటస్ వంటి అంశాలకు ఈ కేసులకు కొంత సంబంధం ఉందని గుర్తించారు. సిఫిలిస్ సోకిన గర్భిణులు, బాలింతలలో సగం మంది హిస్పానిక్, లాటిన్, స్పానిష్ మూలాలున్నవారే అని ఈ అధ్యయనం గుర్తించింది.

ఆస్ట్రేలియాలో 2015లో సిఫిలిస్ కేసులు రికార్డ్ స్థాయిలో నమోదు కాగా ఆ తరువాత ఇంకా 90 శాతం కేసులు పెరిగాయని 2020లో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.

కాస్ట్ ఆఫ్ లివింగ్ సంక్షోభం కారణంగానూ ప్రజారోగ్య వనరులపై ప్రభావం పడింది. అంతేకాదు.. లైంగికంగా సంక్రమించే వ్యాధుల విషయంలో ప్రజల ధోరణుల్లోనూ మార్పులొచ్చాయి.

‘1990ల మధ్యలో హెచ్ఐవీకి యాంటీ రెట్రోవైరల్ థెరపీ అందుబాటులోకి రావడంతో భారీ మార్పు వచ్చింది’ అని మెనా చెప్పారు.

డేటింగ్ యాప్స్, సిఫిలిస్ కేసుల మధ్య సంబంధం పరిశీలిస్తూ సెక్సువల్ ప్రాక్టీసెస్‌లో మార్పులపై అధ్యయనం చేస్తున్నారు కొందరు జపాన్ పరిశోధకులు. సిఫిలిస్ కేసులకు డేటింగ్ యాప్స్‌కు సంబంధం ఉందని వారు తేల్చారు.

ఇలాంటి యాప్స్‌లో పరిచయమైనవారు తగిన రక్షణ పద్ధతులు పాటించకుండా సెక్స్‌లో పాల్గొంటునున్నారని వీరి అధ్యయనంలో తేలింది.

సెక్స్ వర్కర్స్‌తో తాను మాట్లాడినప్పుడు ఇలాంటి ధోరణులు గుర్తించినట్లు జపనీస్ యూత్ కల్చర్, సెక్స్ వర్క్‌పై ఆర్టికల్స్ రాసే ససాకి చివావా చెప్పారు.

సెక్స్ వర్కర్లలో చాలామంది కండోమ్‌లు ఉపయోగించడం లేదని, లైంగికంగా సంక్రమించే వ్యాధులు లేవని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా కస్టమర్లపై లేదని చివావా చెప్పారు.

సెక్స్ వర్కర్లలో చాలామంది రిస్క్ కంటే డబ్బు సంపాదనకే ప్రాధాన్యమిస్తారని చివావా చెప్పారు.

అయితే, ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడంపై అధికారులకు స్పష్టత ఉంది. పెన్సిలిన్ దీనికి మంచి మందని.. రక్షిత సెక్స్, పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చని చెప్తున్నారు.