ముధోల్ ఎమ్మెల్యే జి.విట్టల్ రెడ్డి వైఖరికి నిరసనగా ముధోల్ మాజీ జడ్పీటీసీ లక్ష్మీ నర్సగౌడ్ రాజీనామా చేశారు. ఆదివారం ముధోల్ మండలంలోని తరోడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజీనామా లేఖను పోస్ట్ ద్వారా అధిష్టానానికి పంపుతున్నామని వెల్లడించారు. గత మూడు పర్యాయాలుగా పోటీ చేసిన ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి కు పూర్తిగా సహకరించామని తెలిపారు. అయిన సీనియర్ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోకపోవడంతోనే రాజీనామా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. యువకుల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. దళితులు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం పథకాలు ప్రకటించి అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తమను ఆహ్వానించి చర్చించారన్నారు. ఆగస్టు 5 లోపు నాయకులు, కార్యకర్తలతో చర్చించి ఏ పార్టీలో చేరాలి అనే విషయంపై ప్రకటన చేస్తామన్నారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇతర పార్టీల్లో చేరుతామని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ కు మాజీ ఎంపీపీ రాజీనామా చేయడం ఉమ్మడి మండలంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అనూష సాయి బాబా, సర్పంచ్ శ్వేత రవికిరణ్ గౌడ్, నాయకులు నర్సారెడ్డి లక్ష్మణ్ సత్యనారాయణ, గైని భోజన్న, దశరథ్, తదితరులు, పాల్గొన్నారు.