హైతీలో భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. శనివారం 7.2 తీవ్రతతో వచ్చిన ప్రకంపనల ధాటికి ఇప్పటి వరకు 304 మంది మృత్యువాతపడ్డారు. 2010లో సంఘటన నుంచి నుంచి కోలుకుంటున్న ఆ దేశంపై ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. తెల్లవారు జామున ఒక్కసారిగా వచ్చిన ప్రకంపనలతో జనం బయటకు పరుగులు పెట్టారు. అత్యంత జనసాంద్రత కలిగిన రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్ నగరానికి 160 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైంది. భూకంపం తీవ్రతకు భవనాలు నేలమట్టమవగా.. పెద్ద ఎత్తున జనం మృత్యువాతపడగా.. భారీగా తీవ్ర గాయాలకు గురయ్యారు. భూకంపం హైతీ నైరుతి ద్వీపకల్పంలోని పాఠశాలలు, నివాసాలకు నష్టం కలిగించింది.
ఇప్పటి వరకు ఘటనలో 304 మంది మృతి చెందినట్లు ఆ దేశ పౌర సంరక్షణ సంస్థ తెలిపింది. వేలాది మంది గాయపడ్డారని, గల్లంతయ్యారని పేర్కొంది. భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లోని ఆసుపత్రులు నిండిపోయాయి. పెస్టెల్, కోరెయిల్లెస్, రోసాక్స్ మున్సిపాలిటీల్లో కనీసం మూడు పూర్తిగా నిండినట్లు పౌర రక్షణ సంస్థ అధిపతి జెర్రీ చాండ్లర్ తెలిపారు. ప్రకృతి విపత్తు నేపథ్యంలో హైతీ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం తక్షణ సహాయం అందించేందుకు ఆదేశాలు ఇచ్చారు. భూకంపం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నష్టాన్ని అంచనా వేయడానికి, ప్రజలను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రధానంగా లెస్‌కేస్ నగరంలో భారీగా నష్టం జరిగింది. ఆ దేశ ప్రధాని హెన్నీ ఏరియల్ సర్వే నిర్వహించారు.
అనంతరం నెల రోజుల పాటు దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఎవరూ భయపడొద్దని సూచించారు. భూకంపం సంభవించిన అనంతరం యూఎస్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరిక జారీ చేసింది.హైతీ తీరం నుంచి మూడు మీటర్లు (10 అడుగులు) అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించి, ఆ తర్వాత ఉపసంహరించింది. సునామీ హెచ్చరికల నేపథ్యంలో జనం భయంతో నగరం విడిచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. 2010లో సంభవించిన భూకంపానికి పోర్ట్-ఓ-ప్రిన్స్, సమీప నగరాలను చాలా వరకు భవనాలు కూలిపోయాయి. రెండులక్షల మందికిపైగా మరణించగా.. మూడు లక్షల మందికిపైగా గాయపడ్డారు. 15లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. ఇది ఇప్పటికే పేదరికం.. కరోనా, హింసతో అల్లాడుతున్న దేశాన్ని భూకంపం మరో దెబ్బతీసింది.