purendari
తెలంగాణ రాజకీయం

బీజేపీ సీఎం అభ్యర్ధిగా పురందరేశ్వరీ..?

పొలిటికల్ వర్గాల్లో ఇదో హాట్ టాపిక్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె కూడా దగ్గుపాటి పురందేశ్వరి ఈసారి ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలోకి దిగబోతున్నారట. 2024 ఎన్నికల్లో దగ్గుపాటి పురందేశ్వరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బరిలోకి దిగాలని భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విశాఖ పర్యటన నేపథ్యంలో పలు ఊహగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేనతో కలిసి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ అలయన్స్ గా పోటీ చేసే క్రమంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పురందేశ్వరిని ప్రకటించాలన్న డిమాండ్ ప్రస్తుతం బీజేపీతో పాటు ఆమె అనుచరుల్లో పెద్ద ఎత్తున వినిపిస్తుందని టాక్.. పురందేశ్వరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేనతో కలిసి ఎన్నికలకు వెళితే మంచి ఫలితాలు వస్తాయన్న లెక్కలు వేస్తున్నారట ఆమె అభిమానులు, బీజేపీ నేతలు.. రాష్ట్రంలో అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తి ఉన్నా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం దాన్ని అవకాశంగా మలుచుకోలేకపోతుందని, ఆ వ్యాక్యూమ్ ను ఫిల్ చేయాలంటే ఒక ప్రధాన ప్రత్యామ్నాయం కావాలని, దానికి పురందేశ్వరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన, బిజెపి కలిసి వెళ్తే అయ్యే అవకాశం ఉందని దగ్గుపాటి అనుచరుల పొలిటికల్ తాజా విశ్లేషణ అట.

అందుకు అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉందని పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన దాదాపు 20 శాతం పైగా రాష్ట్రంలో ఉన్న కాపు, తెలగ, వంటరి, బలిజ సామాజిక వర్గాలతో పాటు పురందేశ్వరికి చెందిన కమ్మ సామాజిక వర్గాన్ని కలిపి ఉమ్మడి నాయకత్వంతో ముందుకు వెళ్లగలిగితే మిగతా వర్గాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని.. ఇది కచ్చితమైన ప్రత్యామ్నాయం అవుతుందని విశ్లేషిస్తున్నారట. మాజీ కేంద్రమంత్రిగా రెండుసార్లు పార్లమెంటుకి వెళ్లిన అనుభవం ఉన్న నేతగా, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తెగా, మంచి వాగ్ధాటి కలిగిన మహిళ నేతగా అనేక సానుకూల అంశాలు దోహదం చేస్తాయని, ప్రస్తుతమున్న రాష్ట్ర ప్రభుత్వంపై గట్టిగా ఈ ఆరు నెలలు ఫైట్ చేసినా ప్రజల్లో ఒక బలమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించగలిగితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత సులభం కాకపోయినా అవకాశాలు ఉన్నాయని కూడా పార్టీ కేడర్ ఆలోచిస్తుందని సమాచారం..అదే సమయంలో ఈ ప్రతిపాదనను పవన్ కళ్యాణ్, జనసేన శ్రేణులు అంగీకరిస్తాయా అన్న దానిపైనా చర్చ జరిగిందట.

అయితే పవన్ కళ్యాణ్ కి గతంలో చట్టసభల్లో పనిచేసిన అనుభవం లేకపోవడం, జనసేన సంస్థాగతంగా పూర్తిగా పట్టు సాధించకపోవడం, రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా లేకపోవడం లాంటి అనేక కారణాలవల్ల పవన్ కళ్యాణ్ 2024 కి ఈ ప్రతిపాదనని ఆహ్వానిస్తారని ఓ వర్గం భావిస్తోందట. గతంలోనే ఒక సందర్భంలో తనకు ముఖ్యమంత్రి కంటే అసెంబ్లీలో జనసేనకు కొంతమంది ఎమ్మెల్యేల అవసరం ఉందని, మొదటిగా తన ప్రయత్నం కూడా ఆ దిశగానే ఉంటుందని బహిరంగ సభలోనే పవన్ ప్రకటించిన అంశాన్ని వాళ్లు ప్రస్తావిస్తున్నారట. పవన్ కళ్యాణ్ పదవుల కోసం పాకులాడే నాయకుడేమీ కాదని రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా పురందేశ్వరి నాయకత్వాన్ని ఆమోదిస్తారని, అవసరమైతే పవన్ కళ్యాణ్ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైన శాఖకి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుందని ఆ ప్రతిపాదనతో ముందుకు వెళితే జనసేన శ్రేణులు కూడా ఆహ్వానించవచ్చు అన్న ఆలోచన కూడా నడుస్తోందట.

2024లో పురందేశ్వరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంత సులభం కాదు.. కాబట్టి అదే సమయంలో కేంద్రంలో బిజెపి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని.. కేంద్ర మంత్రిగా అవకాశాన్ని ఇచ్చే ప్రతిపాదనలతో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్టు కొన్ని వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయని, ఆ దిశగా ప్రాథమిక చర్చలు కూడా జరుగుతున్నట్టు బోగట్టా..!ఇప్పటివరకు విశాఖ పార్లమెంట్ నుంచి పురందేశ్వరి పోటీ చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదన వచ్చి, ఆ దిశగా ముందుకు వెళితే పురందేశ్వరి ఏ నియోజకవర్గంలో నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారన్న చర్చ కూడా ప్రారంభమైంది.. గతంలో 2004లో బాపట్ల కాంగ్రెస్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనంతరం 2009లో విశాఖ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఆమె పోటీ చేసి విజయం సాధించి మళ్లీ కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత 2014లో రాజంపేట నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి అక్కడ ఓటమిపాలయ్యారు. 2019లో తిరిగి విశాఖ లోక్సభ నుంచి పోటీ చేసి కేవలం 30 వేల ఓట్ల మాత్రమే ఆమె సాధించారు.

దీంతో 2024 ఎన్నికల్లో విశాఖ నుంచే లోకసభకు పోటీ చేస్తారని కూడా ఒక చర్చ నడిచింది. అయితే తాజా ప్రతిపాదన నేపథ్యంలో ఆమె తన సొంత నియోజకవర్గమైన పర్చూరు నుంచి పోటీ చేస్తారన్న ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతుంది. పర్చూరులో 2019లో పుందేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వర రావు వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన నేపథ్యం ఉంది. గతంలో కూడా దగ్గుపాటి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన నేపథ్యం కూడా ఉండడం, స్థానిక బలం బలగం ఉన్న నేపథ్యంలో అదే సురక్షితమైన స్థానమని భావిస్తున్నారట. అదే సమయంలో విశాఖ నగర పరిధిలోని నియోజకవర్గాలను కూడా పరిశీలిస్తున్నారట. అయితే ఎక్కువ మంది మాత్రం పరుచూరి పైనే సిఫార్సు చేస్తున్నారట. ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగాలంటే పరుచూరి అసెంబ్లీ నుంచి, లేదంటే ఆమెను ఎంపీ గానే పోటీ చేయించాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంటే.. విశాఖ నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు సమాచారం. అయితే, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కావున 2024 ఎన్నికల్లో పురందేశ్వరి పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తికర చర్చ ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది.