manipur
జాతీయం ముఖ్యాంశాలు

వలస బాట పడుతున్న మణిపూర్ వాసులు

మణిపూర్‌లో హింసను తట్టుకోలేక చాలా మంది రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నారు. పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. మిజోరంకి వేలాది మంది వలస వెళ్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే 5 వేల మంది కుకీలు భయంతో మణిపూర్‌ని వదిలి నాగాలాండ్‌కి వెళ్లారు. అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. అయితే…అక్కడ ప్రత్యేకంగా వీళ్ల కోసం అంటూ రిలీఫ్ క్యాంప్‌లు ఏమీ లేవు. ఫలితంగా…ఎక్కడో ఓ మారుమూల గ్రామంలో తలదాచుకుంటున్నారు. ఇలా వలస వెళ్లిన వారిలో చంటిబిడ్డల తల్లులూ ఉన్నారు. మణిపూర్‌లో జరుగుతున్న దారుణాలను తలుచుకుని వెక్కివెక్కి ఏడుస్తున్నారు. “అక్కడి దారుణాలు చూశాక ఇప్పటికీ నా వెన్నులో వణుకు పుడుతోంది. మా ఇంటి గేట్ చాలా పాతది. ఎప్పుడు ఎవరు వచ్చి దాన్ని కూల్చేస్తారో లోపలికి వస్తారో అని భయపడిపోయాం.

అందుకే అక్కడి నుంచి వచ్చేశాం. ఇక్కడే మా బంధువుల ఇంట్లో తల దాచుకుంటున్నాం. ఈ పాటికి మా ఇంటిని తగలబెట్టేసి ఉంటారు. వాళ్లంతా వచ్చి దాడులు చేస్తుంటే పోలీసులు పక్కనే ఉండి ఏమీ పట్టనట్టుగా ఉన్నారు. కేవలం వాళ్లను చూస్తూ ఉండిపోయారు. వాళ్లు ఎందుకలా చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఇళ్లు తగలబెట్టొద్దు అని మాత్రమే చెబుతున్నారు తప్ప పోలీసులు వాళ్లను అడ్డుకోవడం లేదు”ఎన్నో ఏళ్లుగా ఉంటున్నప్పటికీ మణిపూర్‌ తమకు సురక్షిత ప్రాంతం కాదని కుకీలు భావిస్తున్నారు. ఎలాగోలా బతికి బయట పడితే చాలు అనుకునే పరిస్థితులు వచ్చాయి. నాగాలాండ్ నుంచి మళ్లీ మణిపూర్‌కి వస్తారా అన్న ప్రశ్నకు వాళ్ల దగ్గర సమాధానం లేదు. తమ భవిష్యత్ ఏంటో అర్థం కావడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. విద్యార్థుల పరిస్థితైతే మరీ దారుణంగా ఉంది.

ఉన్నట్టుండి అర్ధరాత్రి తమ ఇళ్లపై దాడులు మొదలయ్యాయని, అప్పటికప్పుడు అన్నీ వదిలేసి నాగాలాండ్‌కి వచ్చామని వివరిస్తున్నారు. చదువుకోడానికి వీల్లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం జోక్యం చేసుకుని శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. చాలా మంది బాధితుల ఇళ్లు మంటల్లో కాలి బూడిదైపోయాయి. అందుకే రెండు రోజుల పాటు కొండ ప్రాంతాల్లో నడుచుకుంటూ నాగాలాండ్‌కి చేరుకుంటున్నారు. కొంత మంది పొలాలనూ మైతేయి వర్గ ప్రజలు లాక్కుంటున్నారు. వందలాది ఇళ్లు బూడిదయ్యాయి.