తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో విడుత సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. ఇందులో 85.47 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రెండో విడుతలో కొత్తగా 7,417 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఇక 25,148 మంది విద్యార్థులు తమ సీట్లను మార్చుకున్నారు. రెండో విడుత సీట్ల కేటాయింపుల తర్వాత 12,013 సీట్లు మిగిలాయి. నాలుగు యూనివర్సిటీలు, 28 ప్రయివేటు కాలేజీల్లో మొత్తంగా 32 ఇంజినీరింగ్ కాలేజీల్లో 100 శాతం సీట్లు నిండాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 2వ తేదీ లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్ సూచించారు. ఆగస్టు 4వ తేదీ నుంచి తుది విడుత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల్లో 94.40 శాతం సీట్లు భర్తీ కాగా, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 78.03 శాతం, సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 43.48 శాతం, ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో 60.02 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
సెల్ఫ్ రిపోర్టింగ్ ఇలా..
ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాట్‌మెంట్ ఆర్డర్‌లో పేర్కొన్న ఫీజును క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఆ తర్వాత సీటు కన్ఫర్మేషన్ అవుతుంది. అయితే ట్యూషన్ ఫీజు చెల్లించే విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల ఖాతా నుంచి చెల్లిస్తే మంచిదని సూచించారు. ఎందుకంటే.. రీఫండ్ చేసేందుకు సులభంగా ఉంటుందని తెలిపారు.