pawan
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

మంగళగిరికి మకాం మార్చేసిన జనసేనాని

ఏపీలో వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సై అంటున్నారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కల్యాణ్‌ను నాన్ లోకల్ అని విమర్శిస్తుంది. హైదరాబాద్‌లో ఉంటూ పార్ట్ టైం పొలిటీషియన్‌గా రాష్ట్రానికి వచ్చి వెళ్తుంటారని విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలకు చెక్ పెట్టాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రజలకు అతి చేరువలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించిన పవన్ కల్యాణ్ ఇకపై మంగళగిరి నుచే నిర్వహించనున్నారు. అంతేకాదు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి మంగళగిరికి మార్చేశారు.

కేంద్ర కార్యాలయం సిబ్బంది, ఫైల్స్, ఇతర విభాగాలు, కంప్యూటర్‌‌లు కూడా మంగళగిరికి ఇప్పటికే తరలించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌కు అనుగుణంగా ఇంటి నిర్మాణం జరిగిందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక నుంచి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలోనే పవన్‌ కల్యాణ్ ఉంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. . హైదరాబాద్ నుంచి మంగళగిరికి జనసేన ఆఫీస్ తరలించినట్లు ప్రచారం జరుగుతుంది. జనసేన కేంద్ర కార్యాలయం సిబ్బంది, ఇతర విభాగాలు, ఫైళ్లు, కంప్యూటర్లు మంగళగిరికి తరలించారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇకపై షూటింగ్‌లు ఉంటేనే పవన్ కల్యాణ్ హైదరాబాద్ వెళ్లనున్నారని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో పవన్ కల్యాణ్‌కు అనుగుణంగా ఇంటి నిర్మాణం జరగబోతుంది అని ప్రచారం జరుగుతుంది.

భవిష్యత్‌లో పవన్ కల్యాణ్ చేయబోయే సినిమాల గురించి చర్చించాలంటే మంగళగిరికి రావాల్సిందేనని తెలుస్తోంది. సోమ, మంగళవారాల్లో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, మూడో విడత వారాహి యాత్రపై పార్టీ నేతలతో చర్చించారు. తూర్పు, పశ్చిమ గోదావరి, ఇతర జిల్లాల నేతలను పవన్ మంగళగిరికి పిలిపించి పవన్ కల్యాణ్ మాట్లాడిన సంగతి తెలిసిందే. పార్టీ వివిధ విభాగాల కమిటీలు, సంస్థాగత వ్యవహారాలపై పవన్ కల్యాణ్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్‌లు ఉంటేనే హైదరాబాద్ వెళ్తారని తెలుస్తోంది.జనసేన అధినేత పవన్ కల్యాణ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు సినీ ప్రముఖులు సైతం మంగళగిరికి వస్తారని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇదివరకే దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్‌, డీవీవీ దానయ్యలతో పాటు పలువురు మంగళగిరి వచ్చి జనసేన కార్యాలయంతోపాటు పక్కనే ఉన్న ఇంటిని కూడా సందర్శించారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ సినిమాలు, రాజకీయంపై చర్చించారు.

పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టిన నేపథ్యంలో అందులో బిజీబిజీగా ఉంటారు. కాబట్టి విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో షూటింగులు చేపట్టాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా దర్శకనిర్మాతలు కొన్ని లొకేషన్లను కూడా పరిశీలించారు. సినిమా షూటింగ్‌లపై దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ…మంగళగిరి ప్రాంతం షూటింగులకు అనుకూలంగా ఉందని.. పవన్ కల్యాణ్ ఇకపై మంగళగిరిలోనే ఉండబోతున్నారని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ సినిమా షూటింగులే కాకుండా.. ఇతర సినిమాల షూటింగులను కూడా ఇక్కడ నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే రాజమండ్రి, వైజాగ్ వంటి ప్రాంతాల్లో సినిమా షూటింగులు జరుగుతున్నాయని.. ఇకపై బెజవాడ, మంగళగిరి ప్రాంతాల్లోనూ షూటింగులు తీసే అంశంపై దర్శక, నిర్మాతలతో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. త్వరలోనే విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగులు జరగబోతున్నాయన్నారు.

మరోవైపు నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ… ఏపీలోని మంగళగిరి, బెజవాడ ప్రాంతాల్లో రెగ్యులర్‌గా షూటింగ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.తెలంగాణ రాష్ట్రలో కూడా జనసేన పార్టీ ఉంది. జనసేన పార్టీకి బలమైన కార్యకర్తలు సైతం ఉన్నారు. మరి తెలంగాణకు రాష్ట్ర కార్యాలయం ఎక్కడ అనేది ప్రశ్నార్థకంగా మారింది. అంటే తెలుగుదేశం పార్టీ మాదిరిగా మంగళగిరినే రెండు రాష్ట్రాలకు కేంద్ర కార్యాలయంగా మారబోతుందా అనేది చర్చకు దారి తీసింది. ఇప్పటికే తెలంగాణ టీడీపీ నేతలు పొలిట్ బ్యూరో సమావేశాలకు మంగళగిరి వెళ్తున్న పరిస్థితి తెలిసిందే. అలాగే తెలంగాణ జనసేన నేతలు సైతం మంగళగిరికి వెళ్లాల్సిందేనా అన్న ఆందోళన కలుగుతుంది. కేంద్ర కార్యాలయం ఏపీకి తరలిపోతే తెలంగాణలోని జనసేన నాయకుల్లో సందేహం నెలకొనే అవకాశాలు లేకపోలేదు. తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళనతో ఇతర పార్టీలలోకి జంప్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

టీడీపీకి కనీసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అయినా ఉంది మరి జనసేనకు అలాంటివి ఏమీ లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ లోటస్ పాండ్‌నుంచి తాడేపల్లికి కేంద్ర కార్యకలాపాలను మార్చిన అనంతరం తెలంగాణలో దుకాణం సర్దేసింది. ఇక టీడీపీ సైతం మంగళగిరికి కేంద్ర కార్యాలయాన్ని మార్చేసిన అనంతరం తెలంగాణలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు అదే తోవలో జనసేన పయనిస్తుందా అన్న సందేహం నెలకొంది.