ప్రతిపక్ష ఇండియా కూటమి (I.N.D.I.A) ఎంపీలు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో సమావేశమయ్యారు. మణిపూర్ సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. జూలై 29, 30 తేదీల్లో ఆ రాష్ట్రంలో పర్యటించిన ఎంపీలు, ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్స్ ఈ బృందంలో ఉన్నారు.రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఈ బృందం మీడియాతో మాట్లాడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, తాము మణిపూర్ సమస్యను రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. మణిపూర్లో మహిళలపై దురాగతాలు జరుగుతున్నాయని, పునరావాస కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవని చెప్పామని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపూర్లో పర్యటించి, శాంతిని పునరుద్ధరించేందుకు కృషి చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు.
మణిపూర్లో మే 3 నుంచి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం వీరి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సమస్యపై ప్రధాని మోదీ పార్లమెంటులో మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. స్వల్ప కాలిక చర్చ జరిపేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ చర్చకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెబుతారని చెప్పింది. కానీ ప్రతిపక్షాలు మోదీయే మాట్లాడాలని పట్టుబడుతున్నాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాల హోరుతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తరచూ వాయిదా పడుతున్నాయి.