తెలంగాణ సెక్రటేరియట్ వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయడం సహా, బీసీ కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు వంటి ప్రధాన డిమాండ్లతో బీసీ జనసభ నాయకులు, నిరుద్యోగులు సచివాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాాలు చేస్తూ సచివాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ సహా ఆందోళనకారులను అరెస్ట్ చేసి డీసీఎం వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.రాష్ట్రంలో బీ.సి కులగణన వెంటనే చేపట్టాలని.. స్థానిక సంస్థల్లో బీ.సీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఓయూ విద్యార్థి జేఏసీ నేత రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ‘
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 10 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలి. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి అమలు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, మూడు నెలలు డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్ 2, 3 పరీక్షల వాయిదా, పోస్టుల సంఖ్య పెంపు తదితర హామీలను నెరవేర్చాలి’ అని సర్కారును డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.రాష్ట్రంలో డీఎస్సీ సహా ఇతర పోటీ పరీక్షలు వాయిదా వేయాలంటూ గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం నగరంలో భారీ వర్షంలోనూ నిరసన తెలిపారు. అశోక్ నగర్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లోనూ నిరుద్యోగులు గత రెండు రోజులుగా ధర్నాలకు దిగారు. పరీక్షలు వాయిదా, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా నిరుద్యోగులు సోమవారం సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సచివాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని భారీగా మోహరించారు.
బాహుబలి బారికేడ్లు, ఇనుప కంచెలు, వాటర్ క్యానన్లు ఏర్పాటు చేశారు. అటు, ఇతర ప్రాంతాల నుంచి సచివాలయం ముట్టడించేందుకు తరలివస్తోన్న విద్యార్థులను, నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. సెక్రటేరియట్‌కు వెళ్లే అన్ని దారుల్లోనూ నిఘా పెంచారుఅటు, ‘ఛలో సచివాలయం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఏఐఎస్ఎఫ్ నాయకులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉపకార వేతనాలు, బోధన రుసుములు విడుదల చేయాలన్న డిమాండ్‌తో జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి సచివాలయానికి ఏఐఎస్ఎఫ్ నాయకులు ర్యాలీ చేపట్టారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం స్పందించకుంటే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించింది.కాగా, పరీక్షలు వాయిదా వేయాలన్న నిరుద్యోగుల ఆందోళనలపై సీఎం రేవంత్ సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.
ప్రత్యేక తెలంగాణ సాధించిందే ఉద్యోగాల కోసమని.. ప్రతీసారి పరీక్షలు వాయిదా వేయడం సరికాదని స్పష్టం చేశారు. ఇదే చివరి డీఎస్సీ కాదని.. త్వరలో 5 వేల నుంచి 6 వేల పోస్టులతో మరో డీఎస్సీ నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు.