ఎన్నికల సందర్భంగా వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో 90 శాతం హామీలు ఇంకా నెరవేర్చలేదని ఆరోపించారు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు. మహా శక్తి చైతన్య రథ యాత్ర ప్రారంభం సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నవరత్నాలలో హైలెట్ చేసిన ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. మహిళలు, రాష్ట్ర అభివృద్ధి సాధించాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలన్నారు గంటా శ్రీనివాస్ రావు. నేడు ప్రారంభమైన మహాశక్తి చైతన్య రథ యాత్ర నలభై రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిరుగుతుందని అన్నారు. ఈ యాత్రతో మహిళల్లో చైతన్యం వస్తుందని తెలిపారు. ఆ దిశగానే ఈ యాత్ర సాగుతుందని వివరించారు. దివంగత ఎన్టీఆర్ మహిళలకు పెద్ద పీట వేశారని గుర్తు చేశారు.
దాన్ని చంద్రబాబు కంటిన్యూ చేశారని వివరించారు. ఆస్తిలో సమాన హక్కులు, మహిళలు రిజర్వేషన్‌లు, మహిళ యూనివర్సిటీ ఏర్పాటు ఆ మహనీయుడి ఘతన అని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు టైంలో మహిళలకు ఆర్థిక సాధికారత దిశగా దీపం పథకం, డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు ఇచ్చారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు భారీగా హామీలు ఇచ్చి తూట్లు పొడిచారన్నారు. అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పి కుటుంబంలో ఒక్కరికే పరిమితం చేశారని తెలిపారు. మోసపూరిత ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టారన్నారు. మళ్లీ సిగ్గు లేకుండా హామీలు 98.85 అమలు చేశామని ప్రచారం చేసుకోవడం కామెడీగా ఉందన్నారు. నవరత్నాలలో హైలెట్ చేసి చెప్పి ఒక్క రత్నమైనా పూర్తిగా అమలు చేశారా? అని ప్రశ్నించారు గంటా శ్రీనివాసరావు. మద్యపాన నిషేధం హామీకి తూట్లు పొడిచారన్నారు. దానిపై అప్పులు తేవడం తప్ప దాని అమలుపై చిత్తశుద్ధి ఎక్కడ ఉందన్నారు.
జగన్ ఇచ్చిన హామీల్లోని 16 అంశాలపై మడమ తిప్పారని ఆరోపించారు. సీపీయస్ రద్దు అమలు చేయలేని…ఉద్యోగులను కూడా మోసం చేశారని విమర్శించారు. రాజధాని నిర్మాణాన్ని అయోమయంలో పడేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం టీడీపీ హయాంలో 75శాతం పూర్తి అయితే వైసీపీ వచ్చాక కనీసం నాలుగు శాతం కూడా చేయలేదన్నారు గంటా. ప్రత్యేక హోదా గాలికి వదిలేశారన్నారు. మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్తిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు ఏమందని నిలదీశారు. జాబ్ క్యాలెండర్, ప్రకృతి వైపరీత్యాలకి 4వెల కోట్లు ఇస్తామన్న హామీ ఎక్కడకు వెళ్లిందన్నారు. ఏటా డిఎస్‌సీ మాటలేదన్నారు. కోల్డ్ స్టోరేజ్, పంటలకు గిట్టుబాటు ధర, జర్నలిస్టులకు ఇల్లు, వృద్ధాశ్రమం, ఇస్లామిక్ బ్యాంకులు, కొత్త పరిశ్రమలు ఇవన్నీ అమలు చేశారా అని నిలదీశారు.
నూటికి తొంభై తొమ్మిది శాతం పెండింగ్‌లో ఉన్నాయన్నారు గంటా శ్రీనివాస్‌రావు. మొదటి నాలుగు సంవత్సరాలు ఏమి చేయలేదని… ఇప్పుడు శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. ఇలా చేయడం వల్ల లాభం ఏంటి అని ప్రశ్నించారు. సచివాలయాలు కూడా వైసీపీ వాళ్లు కట్టినవి కాదని… టీడీపీ హయాలంలో కట్టినవేనని అన్నారు. ఆర్ 5 జోన్‌లో పేదవారికి ఇళ్లు అంటూ జగన్ హడావుడి చేశారన్నారు గంటా. నిర్మాణాలు ఆపేయాలని ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చిందని ఆ ఖర్చంతా ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్రలో ప్రజలు భాగస్వాములు అవుతున్నారన్నారని… మహాశక్తి కార్యక్రమంతో మహిళలు మరింత ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు నాయుడు పర్యటన పదో తేదీ వరకు సాగుతుందని తెలిపారు గంటా. సాగు నీటి ప్రాజెక్టుల సందర్శన 8న విశాఖ రానున్నారని ప్రకటించారు. కర్నూలు, కడప అనంతపురంలో ప్రోగ్రాం ప్రారంభమైందని అన్నారు. పులివెందుల ప్రజలు కూడా చంద్రబాబు నాయుడుని ఆశీర్వదించారని అభిప్రాయపడ్‌డారు. జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో కూడా వైసీపీపై వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు.