newyork
అంతర్జాతీయం

ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ప్రకటనతో రణరంగంగా మారిన న్యూయార్క్ నగరం

ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ప్రకటన కారణంగా న్యూయార్క్ నగరం రణరంగంగా మారింది. తన అభిమానులకు బహుమతులు ఇస్తానన్న ప్రకటనతో వేలాది మంది తరలివచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.న్యూయార్క్ కు చెందిన 21 ఏళ్ల కై సెనాట్ అనే యూట్యూబర్ కు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో అతను తన ఇన్ స్టాగ్రామ్ పేజిలో ఓ పోస్ట్ పెట్టాడు. మన్ హటన్ యూనియన్ స్వ్కేర్ పార్క్ లో శుక్రవారం సాయంత్రం లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్ చేయనున్నట్లు అందులో పేర్కొన్నాడు. అంతేకాదు కార్యక్రమంలో అభిమానులను నేరుగా కలుస్తానని, వారికి ప్లే స్టేషన్ 5 గేమ్ కన్సోల్స్ సహా పలు బహుమతులు ఇస్తానని ప్రకటించారు. ఇది చూసిన అభిమానులు మన్ హటన్ పార్క్ కు వేలాదిగా తరలివచ్చారు.

వీరిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొందరు అభిమానులు అల్లర్లకు పాల్పడ్డారు. వీధుల్లో వాహనాలను అడ్డగించి, కార్ల అద్దాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు దిగారు. ఈ అల్లర్లలో పోలీసు అధికారులు సహా పలువురు గాయపడ్డారు. దీంతో కై సెనాట్ పై పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు ది గార్డియన్ తెలిపింది. సెనాట్ పై అల్లర్లను ప్రేరేపించడం వంటి నేరారోపణలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు పేర్కొంది