ముఖ్యమంత్రి నివాసాన్ని విశాఖకు షిఫ్ట్ చేసే ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. రుషికొండ పై నిర్మిస్తున్న నిర్మాణాల్లోనే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఉండాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆమేరకు భద్రతకు సంబంధించి సమీక్షలు ప్రారంభించింది. రుషికొండపై నిర్మాణాలను ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది నేడు సందర్శించడం తో విశాఖలో హడావుడి ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి నివాసం విశాఖకు మారుస్తారా? లేదా అన్నదానిపై గత కొంతకాలంగా విస్తృత చర్చ జరుగుతూ వస్తోంది. రాజధాని మార్పు అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంకు వస్తారా లేదా ఆన్న చర్చ చాలా కాలం నుంచి నడుస్తూ వస్తోంది. సుప్రీం కోర్టులో డిసెంబర్ వరకు విచారణ వాయిదా పడడంతో ముఖ్యమంత్రి విశాఖ మార్పు పై ఆసక్తికరమైన చర్చలు జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్లో విశాఖకు వస్తున్నట్టు గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టినట్టు సమాచారం.రాజధాని రాకపోయినా తన క్యాంప్ కార్యాలయాన్ని విశాఖకు మార్చాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి ఆమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
దీంతో సీఎం క్యాంప్ ఆఫీస్ పై సృష్టి సారించారు అధికారులు. మొదట పోర్ట్ గెస్ట్ హౌస్ లో ఉండాలని నిర్ణయించుకున్నా వేరే చోట కు మార్చాలని అధికారులు ప్రత్యామ్నాయంపై దృష్టి సారించారు. రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలపై కోర్టు లలో ఈ మధ్య స్పష్టత వచ్చింది. గతంలో నిర్మాణాలు ఉన్న చోట ఇప్పుడు కూడా నిర్మాణాలను చేసుకోవచ్చని, అదనంగా చేస్తే చర్యలు తీసుకోవాలని హై కోర్టు కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సూచించింది. దీంతో గతంలో ఉన్న ప్రాంతంలో సుమారు రెండున్నర ఎకరాలలో ఇప్పటికే నిర్మాణం లో ఉన్న భవనాలను సీఎం క్యాంప్ కార్యాలయం గా మార్చాలని నిర్ణయించారు.దీంతో ఆ ప్రాంతంలో రిషికొండలో సివిల్ నిర్మాణాలు పూర్తిచేసుకుని ఇంటీరియర్ వర్క్స్‌కు సిద్దం అవుతున్న నిర్మాణాలను ఈరోజు ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది సందర్శించారు. అక్టోబర్ 24 దసరా రోజు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ గృహ ప్రవేశం ఉంటుందన్న సమాచారం తో ఇంటీరియర్ కాంట్రాక్టర్స్‌ను కూడా తీసుకొచ్చి అలోపు పనులు పూర్తి చేయడంతో పాటు భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
నిర్మాణాలకు ఒక వైపు సముద్రం ఉండడం, అక్కడ నేవీ పర్యవేక్షణలో భద్రత ఉండడం తో నేవీ అధికారులను కూడా పిలిచి మాట్లాడారు సీఎం భద్రతా సిబ్బంది.ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది రుషికొండలో నిర్మాణాలను సందర్శించారన్న వార్తతో విశాఖలో ఒక్కసారిగా హడావిడి మొదలైంది. ఇక ఒక్కసారి ముఖ్యమంత్రి అధికారికి నివాసం గా గుర్తింపు ముగిసి పనులు ప్రారంభం అయితే ఇక నగర స్వరూపం మారిపోతుందని, ప్రశాంత విశాఖ లో ఇక ఉరుకులు పరుగులు ప్రారంభం కానున్నాయన్న చర్చ ప్రస్తుతం నడుస్తోంది.