revanth
తెలంగాణ రాజకీయం

అటు చెక్ పెడుతూ… ఇటు మార్పులు చేస్తూ

రేవంత్ రెడ్డి  సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 50 రోజులు దాటింది. ఈ నెల రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ దృష్టి సారిస్తూనే రాజకీయంగా బీఆర్ఎస్ నేతలకు చెక్ పెట్టే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. దెబ్బకు దెబ్బ అన్న రీతిలో  రేవంత్ రెడ్డి నిర్ణయాలు సాగుతున్నాయి. ఈ నెల రోజుల్లోనే ఎన్నో కీలకమైన విషయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాలనా విషయాల్లోను, రాజకీయ పరమైన అంశాల్లోను దూకుడుగానే సాగుతున్నారు. మరి కొన్ని విషయాల్లో రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించి తాను పరిణితి చెందిన రాజనీతిజ్ఞుడ్ని అనిపించేలా సీఎం రేవంత్ రాజకీయ చదరంగంలో తొలి పావును కదిపారు. అంతే కాకుండా మాజీ సీఎం ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని, అవసరమైన చికిత్స అందించాలని ప్రకటన చేయడం ద్వారా రాజకీయ వైరుధ్యమే తప్ప వ్యక్తిగత వైరం ఏదీ కేసీర్ కు తనకు మధ్య లేదని చెప్పే ప్రయత్నం  చేశారు.

ఇదంతా రానున్న రోజుల్లో తాను చట్టబద్ధంగా వ్యహరిస్తానని  చేప్పే ప్రయత్నం ఇది.రేవంత్ ముఖ్యమంత్రి సంతకం పూర్తి అయిన వెంటనే ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వోంలో ఏర్పాటు చేసిన ప్రగతి భవన్ కంచెలను తొలగించి తాను చెప్పిన మాటలు చేసి చూపెట్టే టైపని ఓ హెచ్చరికే పంపారు. అదే దిశగా రేవంత్ అడుగులు వెస్తున్నారు. అంతేకాకుండా ప్రజలను కలవని ముఖ్యమంత్రిగా పలు మార్లు మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శల దాడి చేసిన రేవంత్ అదే ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా ప్రకటించడం ద్వారా ప్రజల ముఖ్యమంత్రి తాను అని సంకేతమిచ్చే ప్రయత్నం చేశారు. తాను ప్రగతి భవన్ లో  ఉండకుండా,  తనతో పాటు సీఎం పదవికి పోటీ పడిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పజెప్పడం కూడా రాజకీయంగా ఓ వ్యూహమే. తాను ఉండాల్సిన భవనంలో భట్టికి కేటాయించడం ద్వారా పోటీ నేతలకు కూడా ఎంతో ప్రాధాన్యమిస్తున్నట్లుగా సీఎం రేవంత్ ఈ చర్య ద్వారా పార్టీ శ్రేణులకు  సంకేతాలిచ్చే ప్రయత్నం చేశారు.

సీఎం అయ్యాక తనలో కోపం అనే నరం తెగిపోయిందని మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి తన ప్రత్యర్థుల విషయంలో తరచూ చెప్పేవారు. అదే రీతిలో రేవంత్ రెడ్డి చర్యలు కనిపిస్తున్నాయి.ముఖ్యమంత్రి అయిన కొన్ని గంటల్లోనే బీఆర్ఎస్ హయాంలో ఎన్నికైన ఆయా కార్పోరేషన్ ఛైర్మన్లు సభ్యులు రాజీనామాలు సమర్పించారు. రాజీనామాలు ఇవ్వని వారిని రేవంత్ తొలగించేలా చర్యలు తీసుకున్నారు. గులాబీ ప్రభుత్వ హయంలో కీలకంగా వ్యహరించిన ఐ.ఎ.ఎస్. ఐపీఎస్ అధికారులను లూప్ లైన్లోకి పంపి తనకు అనుకూలమైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. గతంలో ఎవర్నీవదలేది లేదని అధికారులకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి తన హెచ్చరికలకు అనుగుణంగాననే కొద్ది మంది అధికారుల విషంయలో కఠినంగానే వ్యహరించారని చెప్పాలి. దీని ద్వారా తాను ఎవర్నీవదిలేది లేదని పాలనాపరంగా అధికార యంత్రాంగానికి తెలియజెప్పేలా నిర్ణయాలు తీసుకున్నారు.తొలి శాసనసభ నిర్వహణ ద్వారా కూడా ప్రజల్లో ఓ చర్చ జరిగేలా చేశారని రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు.

విపక్షాలకు సమయం ఇవ్వడం ద్వారా  తాను సభా నాయకుడిగా వివక్ష లేకుండా సాగుతున్నట్లుగా తెలంగాణ ప్రజల్లో చర్చ జరిగేలా చూశారు. కేటీఆర్, హరీశ్ రావు వంటి దూకుడుతత్వం కలిగిన నేతలకు అదే స్థాయిలో సమాధానం ఇచ్చేలా  రేవంత్ వ్యూహాత్మకంగా వ్యహరించారనే చెప్పాలి.  పాలనలో తనదైన మార్కు చూపించేలా జిల్లాల ఏర్పాటుపై సమీక్ష జరుపుతామని ప్రకటించారు. ఈ దిశగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ  ఉంటుందని ప్రకటించారు. అంతే కాకుండా ధరణిపై ఓ కమిటీ వేసి భూసమస్యల పరిష్కారం చేస్తామని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసిన ధరణి పోర్టల్ లోపాలమయంగా ఉన్నట్లు చెప్పే ప్రయత్నం చేశారు.ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సన విషయం కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచంలోనే ఇంజనీరింగ్ అద్భుతమని బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష ప్రాచుర్యం కల్పించింది. ఇది పెద్ద లోపాల పుట్టగా అభివర్ణించడానికి రేవంత్ రెడ్డి పావులు కదపడం ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్డిచే విచారణ జరిపించాలని నిర్ణయించారు.

ఈ మేరకు క్యాబినెట్లో తీర్మానం చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అంతే కాకుండా విజిలెన్స్ విచారణకు  ఆదేశించారు. ఇలా పాలనాపరంగా తనదైనా మార్కు కోసం రేవంత్ ప్రయత్నిస్తోన్నట్లు అర్థమవుతోంది. అంతే కాకుండా విద్యుత్  ఒప్పందాలపై సమీక్ష, హైదరాబాద్ లో కారు రేసింగ్  నిర్వహించకుండా  ఉండటం, ఆ ఒప్పందపై  ఉన్నతాధికారికి నోటీసులు ఇవ్వడం అన్నీ ఇందులో భాగమే.శాసన సభ ఎన్నికల్లో  బీఆర్ఎస్  జోరుకు అడ్డుకట్టవేసిన రేవంత్ రెడ్డి రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లోను కారు జోరుకు బ్రేకులు వేసే దిశగా వ్యూహాలు సిద్దం చేస్తున్నట్లు రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ నెలన్నర రోజుల పాలనలో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు చెక్ పెట్టేలా వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఆ విషయాల్లోకి వెళ్తే…. రేవంత్ సీఎం అయ్యాక…. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని చింతలపల్లి మండలం కేశావపురం గ్రామంలో 47 ఎకరాలు ఎస్టీలకు చెందిన భూమి కబ్జా చెసినట్లు శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో నమోదయింది.

ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కొద్ది మంది బీఆర్ఎస్ కార్పోరేటర్లు భూకబ్జా కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ఖమ్మం కార్పోరేటర్ ఇంటిని కబ్జా చేశారన్న ఫిర్యాదు కారణంగా కలెక్టర్ కూల్చి వేయడం జరిగింది. భూపాలపల్లి జిల్లాలోని కొంపల్లిలో చెరువు శిఖం భూమి కబ్జా చేశారన్న కారణంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై కేసు నమోదైంది. కరీంగనర్ లోను ఓ వ్యక్తి తన ఇళ్లు కట్టుకోనియడంలేదని పోలీసు కేసు పెట్టడంతో.. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సమీప బంధువుగా పేరొందిన చీటీ రామారావు, కార్పోరేటర్ తోట రాములు  అరెస్ట్ అయ్యారు. ఇలా అరెస్ట్ ల పర్వం చూస్తే హస్తం వేట మొదలయిందా అన్నట్లుగా ఉంది. రానున్న రోజుల్లో కీలకనేతలపైన కేసులు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల దృష్యా బీఆర్ఎస్ నేతలకు చెక్ పెట్టే దిశగాను, రానున్న రోజుల్లో ఆ పార్టీ దూకుడు తగ్గించేందుకు గాను ఈ కేసులు అస్త్రాలవుతాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
ముఖ్యమంత్రిగా గెలిచిన రేవంత్ వెంటనే ఢిల్లీ పర్యటన చేపట్టారు.

ఢిల్లీ అనగానే పార్టీ హైకమాండ్ ను కలుసుకోవం. కానీ  ఆయన రాష్ట్ర ప్రయోజనాల రీత్యా అంటూ ప్రధాని మోదీని కలిశారు.  అప్పుల్లో కూరుకున్న తెలంగాణాకు రుణాలు ఇవ్వాలని, తెలంగాణకు  ఒక జాతీయప్రాజెక్టు ఇవ్వాలని కోరారు. దీంతో పాటు విభజన హమీల అమలు, రీజినల్ రింగ్ రోడ్డ్ అభివృద్ధి, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, కాజిపేటలో కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టు వంటి అంశాలపై ప్రధానితో చర్చించారు. ఇప్పటి వరకు కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్ల తెలంగాణ నష్టపోయిందని, తాను ఆ తప్పు చేయను అన్న రీతిలో రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటన ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.తొలి విదేశీ పర్యటన కూడా తెలంగాణకు పెట్టుబడులు రాబట్టేందుకు అన్నట్లు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం లో పాల్గొన్నారు రేవంత్. పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. తన ఇంగ్లీషు భాషపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా…. తెలంగాణ  కోసమే అన్నట్లుగా  తానే పారిశ్రామికవేత్తలతో చర్చిస్తూ, ఇంగ్లీషు మీడియా వాళ్లకు  ఇంటర్వూలు ఇస్తూ… తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఈ పర్యటనలన్నింటిలో తెలంగాణ కోసం తాను అన్నట్లుగా సాగుతోందని అర్థమవుతోందిరేవంత్ రెడ్డి అంటే తెలంగాణ వ్యతిరేకి అన్న రీతిలో బీఆర్ఎస్ గతంలో విమర్శలు చేసేది.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోయినా , తనదైన శైలిలో రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదిగారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధికార పీఠం దక్కించుకోవడంతో, తెలంగాణ  అభివృద్ది కోసం తాను ఏదైనా చేసే చక్కటి అవకాశం దక్కినట్లు భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో తాను చేయగలిగే..  ఏ అవకాశాన్ని వదలకుండా జాగ్రత్త వహిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే 14 ఏళ్లు  తెలంగాణ ఉద్యమనేతగా, ఆ తర్వాత పదేళ్లు రాష్ట్ర రథసారధిగా ఉన్న పొలిటికల్ జీనియస్ కేసీఆర్ తో రాజకీయాలు చేయాల్సి ఉంది. ఆషామాషీగా తాను సీఎం కాకతాళీయంగా అవలేదని రేవంత్ చెప్పే ప్రయత్నం చేస్తన్నట్లుగా కనిపిస్తోంది.

అటు పార్టీలోను, పాలనలోను తన మార్కు చూపితేనే  అటు బీఆర్ఎస్ చీఫ్ ను అడ్డుకోవడం, స్వంత పార్టీలో ఎవరికి అందనంత ఇమేజ్ సంపాధించుకోవడం సాధ్యమని రేవంత్ అర్థం చేసుకున్నట్లు  ఆయన నెల రోజుల పాలనా తీరు చెప్పకనే చెబుతోంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గెలుపు, ఆ తర్వాత ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యంపైనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఉండనుందనడంలో ఏలాంటి సందేహం లేదు. ఢిల్లీలోను, స్వంత  పార్టీలోను, తెలంగాణ ప్రజల్లోను తన ఇమేజ్ పెంచుకునే త్రిముఖ వ్యూహంతో రేవంత్ రెడ్డి సాగుతున్నట్లు తెలుస్తోంది.