వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వేగం మరింత పెరగనుంది. ప్రస్తుతం గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతున్న వందేభారత్ ఇకపై 200 నుంచి 220 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనుంది. ఈ మేరకు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్ఎల్ ప్రణాళికలు రచిస్తోంది. రైళ్లను ఈ వేగంతో నడపాలంటే అందుకు కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ రైళ్ల నిర్మాణంలో ప్రస్తుతం బరువైన స్టెయిన్‌లెస్ స్టీల్ వాడుతున్నారు. రైలు వేగం పెరగాలంటే తేలికైన అల్యూమినియం వాడాల్సి ఉంటుంది. ఇదంతా కార్యరూపం దాల్చి, ప్రొటోటైప్ రైలు సిద్ధం కావడానికి రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని రూట్లలో ప్రయోగాత్మకంగా ఈ రైళ్లను ప్రవేశపెడతారు. ఇందుకు తగ్గట్టుగా సిగ్నలింగ్ వ్యవస్థలోనూ మార్పులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
మరోవైపు, వందేభారత్ రైళ్లు ప్రస్తుతం తెలుపు, నీలం రంగుల్లో ఉండగా త్వరలో కాషాయ రంగు కూడా కనిపించనుంది. తొలి విడతలో రెండు కోచ్‌లను, ఒక ఇంజిన్‌ను కాషాయ రంగులో ట్రయల్ వర్షన్‌ను సిద్ధం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వందేభారత్‌లో స్లీపర్ కోచ్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఏసీ స్లీపర్‌లో ఒక ఫస్ట్‌క్లాస్, 4 టూటైర్, 11 త్రీటైర్ కోచ్‌లు ఉండనున్నాయి. వీటితో పాటు రైలులో మరో 25 మార్పులు కూడా చోటుచేసుకుంటున్నాయి. సీటు వాలులో మార్పులతోపాటు సీటు మెత్తదనాన్ని అదనంగా మరో 25 శాతం పెంచుతున్నారు. దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, కాళ్లు పెట్టుకునే స్థలాన్ని విస్తరించడం వంటి మార్పులు తీసుకొస్తున్నారు. అలాగే, మున్ముందు ఈ రైళ్ల తయారీలో వందశాతం స్వదేశీ సామగ్రినే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.