వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సిద్ధమవుతున్నారు. అల్లు అర్జున్‌కు పిల్లను ఇచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 19 నుంచి ఎన్నికల కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాలని చంద్రశేఖర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఇందులోభాగంగానే తన అల్లుడైన ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ రంగంలోకి దింపుతున్నారు. నియోజకవర్గంలో తన రాజకీయ కార్యక్రమాలను ప్రారంభించడానికి పెద్దవూర సమీపంలోని ముసలమ్మ చెట్టు వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో నిర్మించిన కార్యాలయం, ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించేందుకు అల్లు అర్జున్ వస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడుగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కొనసాగుతున్నారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి. అయితే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.
2014లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన పోటీచేసి ఓడిపోయారు.తొలుత చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అనుచరుడుగా మిర్యాలగూడ కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ భాస్కర్ రావుకు టికెట్ దక్కడంతో పోటీ చేసే అవకాశం లభించలేదు. ఆ తర్వాత నల్గొండ ఎంపీగా పోటీ చేయాలని భావించారు. కానీ వేంరెడ్డి నర్సింహారెడ్డికి బీఆర్ఎస్ టికెట్ రావడంతో ఎంపిగా పోటీ చేసే ప్రయత్నాలు ఫలించలేదు. చివరి ప్రయత్నంగా ఈ ఎన్నికల్లో సాగర్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కంచర్ల ఫౌండేషన్ పేరుతో ఆయన పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల్లోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నారు.ముసలమ్మ చెట్టు వద్ద పది వేల మందితో సభ నిర్వహించేందుకు చంద్రశేఖర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు, అల్లు అర్జున్ అభిమానులకు ఇక్కడే భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.తమ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేయనున్నారు. నాగార్జునసాగర్ టికెట్ తనకు ఇవ్వాలంటూ పలుమార్లు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్‌ను కలిసి చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చంద్రశేఖర్ రెడ్డి పోటికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. పార్టీతో సంబంధం లేకుండా మామ తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు అల్లు అర్జున్ అంగీకరించారట.