మాజీమంత్రి ఆర్కే రోజా మరోసారి వార్తల్లోకి ఎక్కారట. ఆమె గతంలో పనిచేసిన పర్యాటక శాఖలోని అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు రావటంతో… ఆ శాఖ ఇమేజ్ దెబ్బతిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. 2019లో ఎమ్మెల్యేగా గెలిచాక.. రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్‌గా రెండున్నర సంవత్సరాలు అవకాశాన్ని జగన్ కల్పించారు. అనంతరం రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్చిన జగన్.. రోజాకు టూరిజం, క్రీడాశాఖ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ఇంత అవకాశం ఉన్నా.. రోజా.. తన పదవీ కాలంలో అటు నియోజకవర్గానికి గానీ.. ఇటు రాష్ట్రానికి కానీ.. తన శాఖ ద్వారా ప్రగతి చూపలేదనే విమర్శలను మూటగట్టుకున్నారట. మంత్రి హయాంలో మేడమ్.. తిరుమలకు దర్శనానికి రావడం.. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తప్ప చేసిందేమీ లేదనే వాదనలు.. సొంత పార్టీలోనే వినిపించాయట.
తిరుమల కొండపై రాజీకీయాలు మాట్లాడితే కేసులు పెట్టాలని ఏకంగా పాలకమండలి సమావేశంలో తీర్మానం పెట్టేంత పరిస్థితి వచ్చిందంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాలూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.దీనికి తోడు ఆమె వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ గొల్ల మండపం వద్ద శిలువ ధరించటమే కాకుండా.. దానిని ఆలయం ఎదుట ప్రదర్శించినా కనీసం దీనిని ఖండించలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు టూరిజంశాఖ మంత్రిగా.. తిరుపతిలోని శ్రీవారి పాదాల చెంత టూరిజం కార్యాలయంలో.. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారనే అపవాదనూ మూటగట్టుకున్నారని సొంత పార్టీలోనే చర్చ సాగిందట. దీనికి తోడు ఆమె మంత్రిగా ఉన్న సమయంలో ఏడు కొండల కింద ముంతాజ్ అనే స్టార్ హోటల్‌కు అనుమతులు మంజూరు చేసి మరో వివాదంలో రోజా ఇరుక్కున్నారట. అన్నింటికంటే మరో వివాదం ఆమెపై ఉందని పొలిటికల్ వర్గాల్లో చర్చసాగుతోందట.
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్టాలకు చెందిన టూరిజం శాఖకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను.. ప్రతిరోజూ 3వేల500 కేటాయించే వారు. ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక భక్తులు వచ్చే వారట. దీంతో ఏపీ టూరిజం అనేక అక్రమాలకు పాల్పడిందని విజిలెన్స్.. రాష్ట ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో బయటపడిందట.దీనిపై అప్రమత్తం అయిన నాటి పాలక మండలి వాటిని పూర్తిగా రద్దు చేసిందట. మరోవైపు.. టూరిజంశాఖకు లీజు బస్సులు నడుస్తున్నాయి. ఇవి చాలా వరకూ ఎక్కడా తిరగడం లేదని సమాచారం. కేవలం తిరుమల టికెట్లు బుక్ చేసి.. బస్సులు తిప్పినట్లు.. దానికోసం అద్దెలు పెద్ద ఎత్తున చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయట. మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ధనుంజయ్‌రెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి..తిరుపతి జిల్లా టూరిజం శాఖ అధికారిగా ఉంటూ.. అనేక దందాలు సాగించారనే ఆరోపణలూ ఉన్నాయి.ఆర్టీసీ డిపో మేనేజర్ అయిన సదరు ఉద్యోగిని డిప్యూటేషన్‌పై టూరిజంశాఖ తీసుకువచ్చారట. ఆయనతో పాటు ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల రీజియన్ అదికారిగా.. పుంగనూరు నియోజకవర్గానికి చెందిన MPDOను నియమించటంతో.. ఇద్దరూ అడ్డగోలుగా దందాలు చేశారని అనేక ఫిర్యాదులు ఉన్నాయట.
తిరుమల శ్రీవారి దర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు రాయచోటికి కూడా టూరిజం బస్సులు నడిపినట్లు లెక్కలు చూపించారట. దీంతో ఎన్నడూ లేని విధంగా కొత్త విషయాలు బయటకు రావటంతో.. సొంత పార్టీలో నాడు చర్చలు సాగాయనే టాక్ నడిచినట్లు తెలుస్తోంది. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే విధంగా వీరంతా వ్యవహరించనట్లు ఆధారాలతో సహా బయటకు రావటంతో.. రోజా మరిన్ని చిక్కుల్లో పడ్డారట.టూరిజం శాఖ నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు.. మొదటినుంచి స్కామ్‌లా మారాయనే ఆరోపణలు ఉన్నాయట. చివరికి ఆర్టీసీ ని కూడా ఇందులో భాగం చేశారనే అపవాదు ఉందట. రాష్టంలోని వివిధ ప్రాంతాల నుంచి టికెట్లు బుక్ చేసుకున్న రికార్డులు క్రియేట్ చేసి.. అప్‌అండ్ డౌన్ ఛార్జీలతో పాటు శ్రీవారి దర్శనం టికెట్‌ను ఇందులో కలిపారట. ఈ విధంగా టికెట్లు బుక్ చేసుకున్న వారు చాలామందీ.. స్వామి వారి దర్శనానికి మాత్రమే వచ్చి బస్సుల్లో మాత్రం ప్రయాణం చేసేవారు కాదట.
ఈ టికెట్లను టూరిజం సిబ్బంది.. అయా బస్సు డ్రైవర్ కండక్టర్లతో ముందుగానే అందించి.. పాత టిక్కెట్ల రసీదులతో సొమ్ములు దోచుకున్నారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. ఈ విధంగా RTC ఆదాయానికీ.. గండికొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయట. అదే విధంగా అద్దె బస్సులు నడిపినట్లు రికార్డులు చూపించి..డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్‌తో పాటు తిరుపతిలో ప్రత్యేకంగా కౌంటర్లు పెట్టి ఈ వ్యవహారం నడిపినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడటంతో ప్రభుత్వ పెద్దలే నాడు కంగుతిన్నారనే వార్తలు వినిపించాయి. శిల్పారామంలో అక్రమదందాలు, టూరిజం హోటల్స్, బార్లులో అడ్డగోలు వ్యవహారాలు నడిచినా.. ఏ రోజూ తన శాఖలపై నాటి మంత్రి రోజా.. రివ్యూ చేసిన దాఖలాలు కూడా లేవనే టాక్ నడుస్తోంది. దీంతో ఇష్టారాజ్యంగా సిబ్బంది. దందాలు నడిపిన పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.
ఏపీ టూరిజం శాఖ ఎఫెక్ట్.. మిగతా రాష్టాల భక్తులకు శాపంలా మారిందట. మిగతా రాష్టాలకు చెందిన భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.మరోవైపు.. తిరుమల శ్రీవారి పాదాలచెంత గతంలో కిరణ్ కూమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవలోక్ ప్రాజెక్టుకు.. తిరుమల కొండల కింద జూపార్క్ కోసం అలిపిరికి మధ్యలో 22 ఎకరాలు కేటాయించారు. అయినా ప్రాజెక్టు నిర్వహణ ప్రారంభం కాలేదు. అప్పట్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జూపార్క్ సమీపంలో శంకుస్థాపన కూడా చేశారట. ఐతే.. ఈ ప్రాంతంలో విలువైన ఎర్రచందనం చెట్లు నరికివేశారట. దేవలోక్ రాలేదు..స్టేడియం కట్టింది లేదు. తర్వాత ఆ భూముల్లోని ఏడు ఎకరాలను ఏకంగా ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మించడానికి అనుమతులు ఇచ్చారట. దీంతో వివాదం కాస్తా ముదిరి పాకాన పడిందనేది రాజకీయవర్గాల మాట.మొదట ఆ భూముల్ని ఒబెరాయ్ గ్రూప్‌కు ఇస్తున్నట్లు టూరిజం శాఖ వెల్లడించిందట. తర్వాత ఆ ప్రాంతంలో ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణం చేస్తూ బోర్డు పెట్టడంతో భక్తులు అవాక్కు అయ్యారట.
ఆన్‌లైన్‌లో అప్పటి సీఎం శంకుస్థాపన కూడా చేసేశారట. అయితే స్టార్ హోటల్ పేరు ముంతాజ్ కావడం అందులోనూ.. స్పా సెంటర్‌తో పాటు బార్ అండ్ రెస్టారెంట్, నాన్ వెజ్ హోటల్ అని తెలియటంతో స్వామివారి భక్తులతో పాటు హిందూ ధార్మిక సంఘాలు కూడా గళం విప్పాయట.ఇన్ని తెలిసినా.. వారానికి ఓసారి శ్రీవారికి పరమభక్తురాలిగా ఉండే రోజా.. దర్శనానికి వచ్చి కనీసం అభ్యంతరం చెప్పలేదని.. సొంతపార్టీలోనే వార్తలు గుప్పుమన్నాయట. అధికారం మారడంతో ముంతాజ్ హోటల్స్‌పై.. తీవ్రమైన చర్చ సాగింది. అనంతరం ముంతాజ్ పేరు తొలగించి.. ట్రెండింట్ పేరుతో హోటల్ నిర్మాణాన్ని ఒబెరాయ్ గ్రూప్ మొదలపెట్టింది. ముంతాజ్ అనే పేరు ఉన్నప్పుడు ఆ శాఖ మంత్రిగా రోజా.. ఏనాడూ స్పందించిన దాఖలాలు లేవని… చాలామంది భక్తులూ పెదవివిరిచారు. దీనిపై మంత్రిగా ఉన్న రోజా ఎందుకు మౌనం వహించారో.. తెలియదంటూ రాజకీయవర్గాలూ ప్రశ్నిస్తున్నారు.
ఏపీఐఐసీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు.. సొంత నియోజకవర్గంలోని వడమాలపేట, విజయపురం మండలాల్లో పరిశ్రమల కోసం స్థల సేకరణ చేయించారు. అయినా అక్కడకు ఒక్కటంటే ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలాలు లేవు. ఉన్న పరిశ్రమలు కూడా పోయాయని స్థానికులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దీంతో పాటు వడమాలపేట మండలంలోని భూములను.. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్థుల కోసం కేటాయించారు.మరోవైపు.. నాడు మంత్రిగా ఉన్న రోజా.. కార్యాలయానికి ఎయిర్ పోర్టు వద్ద రెండు ఎకరాల భూమి కేటాయించారనే విమర్శలనూ ఎదుర్కొన్నారు. క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన రోజా.. జగన్.. జన్మదినోత్సవాలకు అడుదాం ఆంధ్రా పేరుతో హడావిడి చేయడం తప్ప.. రాష్ట స్థాయిలో క్రీడాకారులకు సరైన శిక్షణ శిబిరాలు నిర్వహించనే లేదట. ఫెడరేషన్ పేరుతో క్రీడలు నిర్వహించినా ఎక్కడా వాటికి గుర్తింపు లభించలేదట.
చాలామంది క్రీడాకారులు పోటీలో పాల్గొని విజయం సాధించినా.. వారికి ఎలాంటి గుర్తింపులేదని.. చివరకు ఉన్నతచదువులకు కూడా ఇవి ఉపయోగపడలేదని చాలా మందీ ఆవేదవ వ్యక్తం చేశారట.మొత్తంమీద మాజీమంత్రి రోజా ఎఫెక్ట్‌తో సీరియస్‌గా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అటు శాఖమీద పట్టు తెచ్చుకోలేకపోగా.. నోటి దురుసుతో పార్టీకి నష్టం చేకూర్చారని అటు పార్టీలోనూ చర్చ సాగుతోందట. భవిష్యత్‌లో మరెన్ని వివాదాలు బయటకు వస్తాయోనని పార్టీ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది.