గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థులకు ఓయూ జేఏసీ, టీపీసీసీ, టీజేఎస్ మద్దతు తెలిపాయి. టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడికి వేలాదిగా విద్యార్థులు, అభ్యర్థులు తరలి వచ్చారు. కార్యాలయం ముందు బైఠాయించారు. ప్రిపరేషన్కు తమకు టైం సరిపోవడంలేదని అందుకే గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో మాట్లాడిన అధికారులు చర్చలకు ఆహ్వానించారు. విద్యార్థి సంఘాలను ఆఫీస్లోకి పిలిచి వారితో చర్చిస్తున్నారు. ప్రస్తుతానికి ఆందోళన విరమించాలని వారికి సర్ది చెబుతున్నారు. ఒకేసారి అన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం తమకు ప్రిపేర్ అయ్యే టైం కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఇప్పటికే వివిధ రాజకీయపార్టీల మద్దతు కోరాయి. ప్రతిపక్షాలన్నీ కూడా వారికి మద్దతు ప్రకటించాయి. ప్రస్తుతం చేపట్టిన ఆందోళలో కాంగ్రెస్, టీజేఎస్ కూడా పాల్గొనడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ప్రస్తుతం తెలంగామలో గురుకుల, జేఎల్, డీఎల్ పరీక్షలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో టెట్ ఉంది. ఈలోపే అంటే ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష రాయాల్సి ఉంది. వరుస ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గ్రూప్ 2 పరీక్ష ప్రిపేర్ అయ్యేందుకు సమయం సరిపోదని అందుకే వాయిదా వేయాలని కోరుతున్నారు అభ్యర్థులు. గ్రూప్ 2 పోస్టులకు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఒకే నెలలో గ్రూప్ – 2, గురుకుల పరీక్షల నిర్వహిస్తున్నారనీ, సిలబస్ కూడా వేర్వేరని పేర్కొన్నారు. ఏదో ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీని వల్ల తమకు అర్హతలున్నప్పటికీ అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గ్రూప్ -2 పరీక్షకు ఆగస్టు 29, 30 తేదీలను ఖరారు చేశారు. ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. గ్రూప్ 2 పరీక్షలోని మూడో పేపర్ అయిన ఎకానమీలో అదనంగా 70 శాతం సిలబస్ కలిపారని, సన్నద్ధతకు కేవలం ఒక్క బుక్ మాత్రమే విడుదల చేశారని వాపోయారు. పేపర్ లీకేజీ ఘటనతో సరిగా చదవలేకపోయామని, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గ్రూప్ 2 పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలని బోర్డును కోరారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. గ్రూప్ 2 వాయిదాపై ప్రభుత్వం ఆలోచన చేయాలని కోదండరాం అన్నారు. నిరుద్యోగులు అడిగేది న్యాయమైన డిమాండ్ అని, మూడు వేల నిరుద్యోగ భృతి అడగటం లేదని కేవలం మూడు నెలల గడువు మాత్రమే అడుగుతున్నారని అన్నారు. ఏడేళ్లు ఆగిన ప్రభుత్వం, మూడు నెలలు ఆగలేదా? అంటే ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ప్రశ్నించారు.