పార్లమెంట్ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ఫ్లయింగ్ కిస్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన అనంతరం వెళ్తూ వెళ్తూ బీజేపీ మహిళా ఎంపీల బెంచ్‌ల వైపు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో సభలోని మహిళా ఎంపీలు రాహుల్ పై ఆగ్రహానికి గురయ్యారు. రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. కాగా, ఫ్లైయింగ్ కిస్ వ్యవహారంపై ఓ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే తాజాగా చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారి తీసేలా ఉన్నాయి.బీహార్‌లోని హిసువా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్ మాట్లాడుతూ.. తమ నాయకుడు రాహుల్ గాంధీకి అమ్మాయిల కొరత లేదని, అలాంటిది 50 ఏళ్ల వృద్ధురాలికి ఫ్లైయింగ్ కిస్ ఎందుకు ఇస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
‘మా నాయకుడు రాహుల్ గాంధీకి అమ్మాయిల కొరత లేదు. ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనుకుంటే అమ్మాయికి ఇస్తారు. కానీ 50 ఏళ్ల వృద్ధురాలికి ఎందుకు ఇస్తారు..? రాహుల్ గాంధీపై ఈ ఆరోపణలు నిరాధారమైనవి’ అని నీతూ సింగ్ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఆమె కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని 50 ఏళ్ల వృద్ధురాలు అని పరోక్షంగా అన్నట్లు తెలుస్తోంది.కాగా, ఫ్లైయింగ్ కిస్ వ్యవహారంలో ఇప్పటికే పలువురు నేతలు రాహుల్‌కు మద్దతుగా నిలిచారు. ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన (యూబీటీ) పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా రాహుల్ కు మద్దతుగా నిలిచారు. రాహుల్ ఫ్లయింగ్ కిస్‌లో తప్పేమీ లేదని.. ఆయన ఆప్యాయంగా ‘సంజ్ఞ’ చేశారన్నారు.