- కేంద్రం మరింత ఆర్థిక సహకారం అందించాలి
- కరోనాతో తీవ్రంగా నష్టపోయిన రాష్ర్టాలు
- వచ్చే రెండేండ్లలో మరింత పెరుగనున్న కష్టాలు
- రాష్ర్టాలకు కేంద్రం, ఆర్బీఐ బాసటగా నిలవాలి
- క్రెడిట్ రేటింగ్ సంస్థ ‘ఎస్ అండ్ పీ’ నివేదిక
- ఆదాయం వ్యయాల మధ్య తీవ్ర అంతరాలు
కరోనా దేశ ప్రజల ఆరోగ్యాన్ని హరించటమేకాదు.. ఎన్నో కుటుంబాలను అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి ప్రభావం రాష్ట్రప్రభుత్వాలపైన కూడా తీవ్రంగా ఉంది. వచ్చే ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా పెరిగిపోయి.. బడ్జెట్‌లోటు, అప్పులభారంతో రాష్ట్రాలపై రానున్నరోజుల్లో మరింత పెనుభారం పడనుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అనే అంతర్జాతీయ ఆర్థికసంస్థ తన తాజా నివేదికలో హెచ్చరించింది. వచ్చే రెండేండ్లు కీలకమని.. రాష్ట్రప్రభుత్వాలు ఆర్థికకష్టాల నుంచి గట్టెక్కటానికి తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. 2024 నాటికి రాష్ట్రాల ఆర్థికపరిస్థితి కుదుటపడుతుందని తెలిపింది. ఈ నివేదికను ఎస్ అండ్ పీ ఎనలిస్టులైన యాఫార్న్ ఫువా, రుచిక మల్హోత్రా రూపొందించారు. కరోనా కాలంలో కష్టాల కడలిని ఈదుతున్న రాష్ట్రాలను ఆదుకోవటంలో కేంద్రప్రభుత్వం, ఆర్బీఐ కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు.
భారత్ బలాలు బలహీనతలు
ఈ నివేదికలో భారత ఆర్థికవ్యవస్థ, కేంద్రం-రాష్ట్రాలకు సంబంధించి బలాలను, బలహీనతలను కూడా వివరించారు.
బలాలు
- కేంద్రప్రభుత్వం నుంచి, ఆర్బీఐ నుంచి రాష్ట్రాలకు వ్యవస్థీకృతంగా సాయం లభించటం.
- భారతదేశంలో దృఢంగా ఉన్న సమాఖ్య వ్యవస్థ. ప్రభుత్వ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు బలమైన గొంతు వినిపించే అవకాశం ఉండటం.
- చట్టాలకు భాష్యం చెప్పే దేశవ్యాప్త ఏకీకృత, స్వతంత్ర న్యాయవ్యవస్థ.
బలహీనతలు
- ఆదాయానికి, ఖర్చులకు మధ్య పొంతన లేకపోవటం. కరోనా కారణంగా ఇది మరింత తీవ్రం కావటం.
- ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో వివిధ రంగాల వారీగా భారీగా పేరుకుపోయిన అప్పులు.
- పారదర్శకత ఉండటం మంచిదేగానీ.. జవాబుదారీతనం లేకపోవటం సమస్య. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక అనేది కూడా ఉండటం లేదు.
25 శాతం వరకూ ద్రవ్యలోటు..
కరోనా సంక్షోభం నుంచి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోవటానికి వచ్చే రెండేండ్లు అత్యంత కీలకమని ఎస్ అండ్ పీ నివేదిక అభిప్రాయపడింది. ఆదాయంలో ద్రవ్యలోటు 25 శాతం వరకూ ఉండే పరిస్థితులు నెలకొంటాయని, దీనిని అధిగమించటానికి రాష్ట్రాలు చెమటోడాల్సి వస్తుందని పేర్కొంది. అయితే, 2024 మార్చి నాటికి కాస్త కుదుటపడే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. ‘అప్పటికి కేంద్రప్రభుత్వానికి వచ్చే ఆదాయం స్థిరంగా ఉంటుంది. పన్ను సంస్కరణల వల్ల ఒనగూరే ప్రయోజనాలు రాబడి రూపంలో కనిపిస్తాయి. ఈ మేరకు కేంద్రం.. పన్నులు, గ్రాంట్ల రూపంలో ఈ లాభాల్లో కొంత భాగాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసే అవకాశం ఉంది. ఫలితంగా రాష్ట్రాలు విక్రయించే బాండ్లపై సానుకూల ప్రభావం పడుతుంది’ అని ఈ నివేదికలో పేర్కొన్నారు.
అతిపెద్ద క్రెడిట్ రేటింగ్ కంపెనీ
స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్ రేటింగ్స్ అనే సంస్థనే ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్‌గా పేరొందింది. ఇది అమెరికాకు చెందిన క్రెడిట్ రేటింగ్ కంపెనీ. ప్రపంచంలోని టాప్ 3 క్రెడిట్ రేటింగ్ సంస్థల్లో ఇది ఒకటి. మిగిలిన రెండు కంపెనీలు.. మూడీస్ ఇన్‌వెస్టర్స్ సర్వీస్, ఫిచ్ రేటింగ్స్. వాస్తవానికి ఈ రెండు కంపెనీలకన్నా కూడా పెద్ద సంస్థ ఎస్ అండ్ పీ. ఈ సంస్థ వెలువరించే నివేదికలకు ఆర్థికరంగంలో విశేషమైన ప్రాధాన్యం ఉంది.