pvt university
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఏపీలో ఇంటర్నేషనల్ లెవెల్‌ వర్శిటీ

ఏపీలో అతిపెద్ద ప్రైవేట్‌ యూనివర్శిటీ రాబోతుంది. ఉత్తరాంధ్ర సిగలో.. విశాఖ శివారులో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ విశ్వవిద్యాలయం రూపుదిద్దుకోబోతోంది. సీఎం జగన్‌ అనుమతివ్వడమే తరువాయి.. కొత్త వర్శిటీకి పునాదిరాయి పడనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే కేపిటల్ సిటీకి.. ఇంటర్నేషనల్ లెవెల్‌ వర్శిటీ అదనపు హంగు కానుంది. ఓ వైపు సాగర తీరం.. మరోవైపు పచ్చని కొండలు.. మధ్యలో అందాల నగరం విశాఖ. బీచ్‌లు, ఉద్యానవనాలు, ఆలయాలు, బౌద్ధరామాలు, ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఈ నగరం సొంతం. ఇప్పుడు వాటి సరసన మరో అంతర్జాతీయ విద్యాలయం రాబోతుంది. ఙ్ఞానం, వివేకం, విఙ్ఞానాలను ప్రసాదించే ప్రదేశం యూనివర్సిటీ. అలాంటి వర్సిటీ విశాఖ శివారులోని తుర్లవాడలో రాబోతుంది. దాదాపు 120 ఎకరాల్లో ఏర్పాటు కానుంది.

కేజీ టు పీజీ, స్పోర్ట్స్‌ అండ్ జనరల్ ఎడ్యుకేషన్‌, ప్రొఫెషనల్ కోర్సుల సమాహారంతో అత్యున్నత స్థాయిలో వర్సిటీ రూపుదిద్దుకోబోతుంది. ఆటలపై ఆసక్తి ఉండేవాళ్లకి.. క్రీడా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునే వాళ్లకి కొత్తగా ఏర్పాటు చేయబోయే వర్సిటీ వరంగా మారబోతుంది. స్పోర్ట్స్‌కి సంబంధించి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.విశాఖలో వర్శిటీ పెట్టాలన్నది వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తనయ నేహారెడ్డి ఆలోచన. ఆలోచన వచ్చిందే తడవుగా అందుకు సంబంధించిన కార్యాచరణ మొత్తం ఇప్పటికే పూర్తిచేశారు. లోకల్ టాలెంట్‌తో పాటు అంతర్జాతీయ ప్రమాణాలు వర్శిటీలో ఉండేలా కార్యాచరణ రూపొందించారు. ప్రపంచంలో ప్రసిద్ది పొందిన టాప్‌ – 10 యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు. విద్యా ప్రమాణాలు విషయంలో ఎక్కడా రాజీ లేకుండా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని భావిస్తున్నారు.ప్రపంచ అత్యుత్తమ వర్శిటీలతో పోలిస్తే మన దగ్గర ఉన్నత విద్యా వ్యవస్థ వెనుకబడి ఉంది.

రాబోయే రోజుల్లో మిలియన్ల కొద్ది నిపుణులకు డిమాండ్‌ ఉంది. ఇందుకోసం యువత, విద్యార్థులకు ఉపాధి, నైపుణ్యాల్లో శిక్షణ కొత్తగా రూపుదిద్దుకోబోయే యూనివర్శిటీలో అందించాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ, ప్రణాళికలు కూడా రూపొందించారు.కొత్త యూనివర్సిటీకి సంబంధించిన ఫైల్‌ సీఎం జగన్‌ దగ్గర ఉంది. సీఎం అనుమతివ్వడమే ఆలస్యం యూనివర్శిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఆర్ధిక రాజధానిగా ఉన్న విశాఖకు అంతర్జాతీయ వర్సిటీ రాబోతుండటం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకం కాబోతోంది.